Updated : 26 Jun 2022 23:49 IST

AAP: ఆప్‌కు చుక్కెదురు! సీఎం మాన్‌ ఖాళీ చేసిన ఎంపీ స్థానంలో ఓటమి

శిరోమణి అకాలీ దళ్‌(అమృత్‌సర్‌) అభ్యర్థి సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ విజయం

చండీగఢ్‌: పంజాబ్‌లోని సంగ్రూర్‌ లోక్‌సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్ర అధికార పార్టీ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి చుక్కెదురైంది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఖాళీ చేసిన ఈ స్థానంలో శిరోమణి అకాలీ దళ్‌(అమృత్‌సర్‌) అభ్యర్థి సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ విజయం సాధించారు. హోరాహోరీ పోరు తర్వాత ఆయన 5,822 ఓట్ల తేడాతో ఆప్‌ అభ్యర్థి గుర్మెయిల్‌ సింగ్‌ను ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీ, భాజపాకు చెందిన కేవల్ ఢిల్లన్‌, అకాలీదళ్‌ నేత కమల్‌దీప్ కౌర్ రాజోనా తర్వాతి మూడు స్థానాల్లో నిలిచారు.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన భగవంత్ మాన్.. లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అంతకుముందు మాన్ వరుసగా 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్‌ తరఫున భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈసారి మొత్తం 16 మంది బరిలో నిలిచారు. జూన్‌ 23న పోలింగ్‌ జరగగా.. కేవలం 45.30 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైంది. అదే 2019 లోక్‌సభ ఎన్నికల్లో 72.44 శాతం, 2014లో 76.71 శాతం పోలింగ్ జరిగింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం తర్వాత జరిగిన మొదటి ప్రధాన ఎన్నికల పోరు ఇది. ఈ క్రమంలోనే తన కంచుకోటను నిలుపుకొనేందుకుగానూ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సంగ్రూర్‌ ఎంపీ నియోజకవర్గంలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లోనూ ఆప్‌ విజయభేరి మోగించింది. అవినీతి నిర్మూలన, ఉద్యోగ కల్పన, విద్య, వైద్యరంగాల అభివృద్ధి ప్రధాన అజెండాగా ఆప్‌ బరిలోకి దిగగా.. ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి, ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి.

ఎవరీ సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మాన్‌..

సైనిక, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న 77 ఏళ్ల సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మాన్‌.. మాజీ ఐపీఎస్‌ అధికారి. ఆపరేషన్‌ బ్లూస్టార్‌, సిక్కు అల్లర్లపై నిరసనగా 1984లో రాజీనామా చేశారు. ఆయన తండ్రి లెఫ్టినెంట్‌ కర్నల్‌ జోగిందర్‌ సింగ్‌ మాన్‌.. 1967లో పంజాబ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) చీలికతో ఏర్పడిన శిరోమణి అకాలీదళ్(అమృత్‌సర్) పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. గతంలో రెండు సార్లు ఎంపీగానూ ఉన్నారు. ‘సంగ్రూర్ ఓటర్లకు కృతజ్ఞతలు. నియోజకవర్గంలోని రైతులు, రైతు కూలీలు, వ్యాపారులు.. ప్రతి ఒక్కరి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తా’ అని విజయం అనంతరం ఆయన ట్వీట్‌ చేశారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని