Congress: 110 ఏళ్ల చరిత్రలో.. యూపీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయిన కాంగ్రెస్‌

110 ఏళ్ల యూపీ మండలి చరిత్రలో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

Published : 07 Jul 2022 02:08 IST

లఖ్‌నవూ: దేశవ్యాప్తంగా భాజపా పాలిత ప్రాంతాలు పెరుగుతున్నా కొద్ది కాంగ్రెస్‌ మాత్రం తన ప్రాభవాన్ని కోల్పోతున్నట్లే కనిపిస్తోంది. వరుస ఓటమిలతో సతమతమవుతోన్న ఈ జాతీయ పార్టీకి తాజాగా కొన్ని రాష్ట్రాల్లోని చట్టసభల్లో ప్రాతినిధ్యమే కరువవుతోంది. ఈ క్రమంలో దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనమండలిలో ఇప్పటివరకు ఉన్న ఒక్క స్థానాన్ని కూడా కోల్పోయింది. ఇప్పటివరకు యూపీ శాసనమండలిలో కాంగ్రెస్‌ తరపున ఒక సభ్యుడు ఉండగా.. బుధవారంతో ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో 110 ఏళ్ల యూపీ మండలి చరిత్రలో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు ఏఒక్కరూ లేకుండా పోవడం గమనార్హం.

ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎమ్మెల్సీగా ఉన్న దీపక్‌ సింగ్‌ పదవీకాలం బుధవారంతో ముగిసింది. మొత్తం 12 మంది ఎమ్మెల్సీల పదవీకాలం నేటితో ముగియగా అందులో కాంగ్రెస్‌ అభ్యర్థి ఒకరు. కాగా 403 స్థానాలు కలిగిన యూపీ అసెంబ్లీలో ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది. దీంతో యూపీ మండలిలో తదుపరి కాంగ్రెస్‌ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం లేకుండా పోయినట్లయ్యింది. ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనమండలి 1887లో ఏర్పాటయ్యింది. 1909లో మోతీలాల్‌ నెహ్రూ కాంగ్రెస్‌ తరపున తొలి ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని