Lok Sabha: లోక్‌సభ సమావేశాలకు ముందే మొదలైన రాజకీయ రగడ

ప్రొటెం స్పీకర్‌ నియామకం విషయంలో అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య అప్పుడే వాగ్వాదం మొదలైంది.

Published : 22 Jun 2024 00:12 IST

దిల్లీ: కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత లోక్‌సభ (Lok Sabha) సమావేశాలు ప్రారంభానికి ముందే భాజపా (BJP), కాంగ్రెస్‌ (Congress) మధ్య వాగ్వాదం  మొదలైంది. ప్రొటెం స్పీకర్‌ నియామకం విషయంలో అధికార ఎన్డీయే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌ను చూస్తుంటే అసహ్యమేస్తోందని, చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూస్తోందని విమర్శించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..!

కొత్తగా ఎన్నికైన సభ్యులతో 18వ లోక్‌సభ ఈనెల 24న తొలిసారి కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని సలహా మేరకు సభ్యులలో సీనియర్‌ వ్యక్తిని రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. సభ్యులందరితో ఆయన ప్రమాణస్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఇదంతా పూర్తయిన తర్వాత అధికార, ప్రతిపక్ష సభ్యులంతా కలిసి స్పీకర్‌ను ఎన్నుకుంటారు. నూతన స్పీకర్‌కు బాధ్యతలు అప్పగించి, ప్రొటెం స్పీకర్‌ వైదొలగుతారు. ఇది కేవలం తాత్కాలిక పదవి మాత్రమే. అయితే, ప్రస్తుత లోక్‌సభకు ఎన్నికైన వారిలో కాంగ్రెస్‌కు చెందిన కోడికున్నిల్‌ సురేష్‌ అత్యధికంగా 8 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆయన కేరళకు చెందిన దళిత నేత. ఆయన్నే ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారని హస్తం పార్టీ భావించింది. అందుకు భిన్నంగా అధికార ఎన్డీయే.. 7 సార్లు ఎంపీగా గెలుపొందిన భాజపా నేత మెహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమైంది. దీంతో సమావేశాలకు ముందే అధికార, ప్రతిపక్షాల మధ్య వార్‌ మొదలైంది.

భాజపా తీరుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ మండిపడ్డారు. పార్లమెంట్‌ నిబంధనల్ని భాజపా తుంగలో తొక్కేస్తోందని విమర్శించారు. సురేష్‌ను ఎందుకు పక్కన పెట్టారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పందించారు. కాంగ్రెస్‌ ఇలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. తాత్కాలికమైన ప్రొటెం స్పీకర్‌ అంశంలోనే ఇంత రభస సృష్టించడం సరికాదన్నారు. ఈ లోక్‌సభ సమావేశాలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అప్పుడే ఈ సమావేశాలు సరైన దిశలో సాగుతాయని చెప్పారు. పార్లమెంట్‌ సంప్రదాయాల ప్రకారం.. వరుసగా అత్యధిక సార్లు ఎంపీగా ఎన్నికైన వ్యక్తి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంటుందని, దానికి మెహతాబ్‌ అర్హులని చెప్పారు. 1998-2019 మధ్య ఒడిశాలోని కటక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన వరుస విజయాలు సాధించారన్నారు. గతంలో బిజు జనతాదళలో ఉన్న మెహతాబ్‌.. తాజా సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు. తాజా ఎన్నికల్లోనూ కటక్‌ నుంచే విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని