Atchannaidu: ఏం తప్పు చేశారని తెదేపా నేతల గృహ నిర్బంధాలు?: అచ్చెన్న

రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల గృహ నిర్బంధాలను తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. సైకో రెడ్డి పాలనలో దేవుడిని చూసే భాగ్యం కూడా లేదా అని ప్రశ్నించారు.

Updated : 19 Sep 2023 13:33 IST

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల గృహ నిర్బంధాలను తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. సైకో రెడ్డి పాలనలో దేవుడిని చూసే భాగ్యం కూడా లేదా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డీ.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేవని గుర్తుంచుకో అని అచ్చెన్న వ్యాఖ్యానించారు. జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన చంద్రబాబుపై జగన్‌ అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలని భగవంతుడిని ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తున్న తెదేపా  నేతలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. వారు ఏం తప్పు చేశారని గృహ నిర్బంధాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు నిలదీశారు.

ఏపీ వ్యాప్తంగా తెదేపా నేతల నిరసనలు.. ఎక్కడికక్కడ పోలీసుల అడ్డగింత

‘‘దేవుడికి బాధలు చెప్పే స్వేచ్ఛ కూడా జగన్‌ పాలనలో లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? చంద్రబాబు అరెస్ట్ జరిగినప్పటి నుంచి తెదేపా నేతలను గృహనిర్భంధం చేస్తూనే ఉన్నారు. మీ అరాచకాలు బయటపడతాయని భయమా? మా వాళ్లు చేసిన తప్పేంటి? ఎక్కడైనా విధ్వంసాలకు, చట్ట వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డారా? పోలీసులు చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారు. హద్దులు దాటి అణచివేతకు గురి చేస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి పైశాచికానందం పొందుతున్న వైకాపా నేతల మాటల్ని పోలీసులు వినొద్దు. చంద్రబాబు కోసం అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తుంటే వారిని అడ్డుకోవడం దేనికి సంకేతం? ఎన్నికలు దగ్గర పడుతున్నా.. రాజారెడ్డి రాజ్యాంగాన్నే అమలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం’’ అని అచ్చెన్న అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని