Rajasthan Crisis: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభానికి ఆ ముగ్గురే కారణం!

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్యంగా తలెత్తిన రాజకీయ సంక్షోభానికి సీఎం గహ్లోత్‌ వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలే....

Published : 27 Sep 2022 21:05 IST

సోనియాకు ఇచ్చిన నివేదికలో గహ్లోత్‌కి క్లీన్‌ చిట్‌! 

దిల్లీ: రాజస్థాన్‌(Rajasthan) కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్యంగా తలెత్తిన రాజకీయ సంక్షోభానికి సీఎం అశోక్‌ గహ్లోత్‌ వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలే కారణమని ఆ పార్టీ కేంద్ర పరిశీలకుల బృందం తేల్చింది. ఆదివారం రాత్రి కొనసాగిన హైడ్రామా, తదనంతర పరిణామాల్లో సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రమేయం లేదని పేర్కొంటూ ఆయనపై చర్యలకు ఎలాంటి సిఫారసు చేయలేదు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న హైడ్రామా తర్వాత ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై పార్టీ కేంద్ర పరిశీలకులైన అజయ్‌ మాకెన్‌, మల్లిఖార్జున ఖర్గే దాదాపు తొమ్మిది పేజీలతో నివేదికను ఈ సాయంత్రం సోనియాకు అందజేశారు. రాజస్థాన్‌లో పార్టీ సంక్షోభానికి కారణమైన మంత్రి శాంతి ధరీవాల్‌,  చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషీ, ఎమ్మెల్యే ఛైర్మన్‌ ధర్మేంద్ర పాఠక్‌లపై క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేశారు. ఈ ముగ్గురూ సీఎల్పీ భేటీకి సమాంతరంగా మరో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి సీఎంపై తీర్మానం చేశారని నివేదికలో పేర్కొన్నారు. సచిన్‌ పైలట్‌ 2020లో తిరుగుబాటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆ సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన గహ్లోత్‌ వర్గం నుంచి ఒకరికి సీఎంని చేయాలని తీర్మానాన్నిఆమోదించారని నివేదికలో పేర్కొన్నారు. 

ఆ తర్వాత 92మంది ఎమ్మెల్యేలు గహ్లోత్‌ వారసుడిని ఎన్నుకొనేందుకు ఉద్దేశించిన సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టారని, స్పీకర్‌ను కలిసి పైలట్‌ను సీఎంని చేయకుండా అడ్డుకొనేందుకు మూకుమ్మడి రాజీనామా చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్టు ఈ నివేదిక తెలిపింది. అక్కడి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సోనియా గాంధీ చేసిన ప్రయత్నాన్ని ప్రతిఘటించేలా వ్యవహరించారని.. కేంద్ర నేతలతో ఒకరి తర్వాత ఒకరు భేటీకి సైతం నిరాకరించినట్టు పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ముగ్గురికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని