Oxygen పెంచండి..లేదంటే ప్రాణాలు పోతాయ్‌!

ప్రధాని మోదీకి పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత అంశంపై వరుసగా రెండో రోజు కూడా ఆమె  మోదీకి  లేఖ రాశారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పాడుతోందని లేఖలో..

Updated : 07 May 2021 19:32 IST

మమతా బెనర్జీ

కోల్‌కతా: ప్రధాని మోదీకి పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత అంశంపై వరుసగా రెండో రోజు కూడా ఆమె  మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పాడుతోందని లేఖలో పేర్కొన్నారు. మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగం అనూహ్యంగా పెరిగిపోతోందని, ప్రస్తుతం రోజుకు 470 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతోందని, రానున్న వారంలో రోజుల్లో ఇది 550 మెట్రిక్‌ టన్నులకు పెరిగిపోయే అవకాశముందని ఆమె తెలిపారు. 

‘‘రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 470 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమైంది. మరో ఏడెనిమిది రోజుల్లో ఇది 550మెట్రిక్‌ టన్నులకు చేరుకునే అవకాశముంది’’ అని మమత తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇదే అంశాన్ని కేంద్ర ఉన్నత స్థాయి అధికారులతోపాటు, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి దృష్టి కూడా తీసుకెళ్లారని, వీలైనంత తొందరగా రాష్ట్రానికి ఆక్సిజన్‌ సరఫరాను పెంచాలని కోరారు. 

అన్ని రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన దానికంటే కేంద్రం ఆక్సిజన్‌ సరఫరాను పెంచిందని, బెంగాల్‌పై మాత్రం శీతకన్ను వేసిందని మమత ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు 560 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్నా.. రాష్ట్రానికి 308 టన్నులు మాత్రమే దక్కుతోందని ఆమె పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో భారీ స్థాయిలో ఆక్సిజన్‌ అవసరమున్నందున కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. లేని పక్షంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందన్నారు.

దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ఆక్సిజన్‌కు తీవ్ర సమస్య ఏర్పడుతోంది. ఇవాళ దేశంలో నాలుగు లక్షల కేసులు నమోదైతే అందులో 18,000 కేసులు బంగాల్‌లోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో 1.2 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఆక్సిజన్‌ సమస్య కేవలం పశ్చిమ్‌బంగాల్‌లోనే కాదు.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని రాష్ట్రాలకు దీనిపై కోర్టులకు కూడా వెళ్తున్నాయి. దిల్లీకి ప్రతిరోజూ 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలన్న సుప్రీం కోర్టు.. కర్ణాటకకు కూడా ప్రాణవాయువు సరఫరాను పెంచాలని ఆదేశించిన విషయం తెలిసందే.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు