MK Stalin: ‘ఎమర్జెన్సీని వ్యతిరేకించొద్దని ఇందిరా గాంధీ కోరారు..!’

ఎమర్జెన్సీని వ్యతిరేకించొద్దని ‘డీఎంకే’ను నాటి ప్రధాని ఇందిరా గాంధీ కోరినట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గుర్తుచేశారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎం.కరుణానిధి మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తితో దాన్ని వ్యతిరేకించారని వెల్లడించారు.

Published : 12 Mar 2023 01:41 IST

చెన్నై: స్వతంత్ర భారత చరిత్రలో ‘ఎమర్జెన్సీ(Emergency)’ రోజులను ఓ చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తుంటారు! ఆ సమయంలో ఎమర్జెన్సీని వ్యతిరేకించొద్దని ‘డీఎంకే’ను నాటి ప్రధాని ఇందిరా గాంధీ కోరినట్లు తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం వెల్లడించారు. అయితే, అప్పటి ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎం.కరుణానిధి(M Karunanidhi) మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తితో దాన్ని వ్యతిరేకించారని, తదనంతర పరిణామాల్లో ఆయన ప్రభుత్వం రద్దయినట్లు గుర్తుచేశారు. వివిధ పార్టీలకు చెందిన 4 వేలకుపైగా కార్యకర్తలు శనివారం అధికార డీఏంకే(DMK)లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టాలిన్‌(MK Stalin) ఈ మేరకు ప్రసంగించారు.

‘1975 ఎమర్జెన్సీ సమయంలో తమిళనాడులో మేం అధికారంలో ఉన్నాం. ఆ సమయంలో సీఎం కరుణానిధికి దిల్లీ నుంచి ఒక సందేశం అందింది. ఎమర్జెన్సీని వ్యతిరేకించకూడదని ఇందిరా గాంధీ దూతలు ఆయనకు సూచించారు. లేనిపక్షంలో.. మరుక్షణమే డీఎంకే ప్రభుత్వం పడిపోతుందని హెచ్చరించారు. అయితే, తనకు జీవితంపై చింతలేదని, ప్రజాస్వామ్యం మాత్రం ముఖ్యమని కరుణానిధి వారికి స్పష్టం చేశారు. అనంతరం మెరీనాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రతిపాదించారు’ అని స్టాలిన్ నాటి సంగతులు గుర్తు చేశారు. ఆపై డీఎంకే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారని, తామంతా అరెస్టయినట్లు చెప్పారని స్టాలిన్‌ అన్నారు. కరుణానిధి ఎప్పుడూ అధికారం గురించి పట్టించుకోలేదని.. ప్రజలు, దేశం గురించి మాత్రమే ఆలోచించారన్న విషయాన్ని చెప్పేందుకు ఈ ఘటనను గుర్తుచేసినట్లు సీఎం స్టాలిన్‌ తెలిపారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్(ఎస్‌పీఏ) కేవలం ఒక్క సీటు మాత్రమే కోల్పోయిందని సీఎం స్టాలిన్ తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 40 సీట్లు (తమిళనాడులో 39, పుదుచ్చేరిలో ఒకటి) సాధించేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటీవలి ఈరోడ్(తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మిత్రపక్షం కాంగ్రెస్ అభ్యర్థి విజయం ద్వారా.. ప్రజలు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు సందేశం ఇచ్చారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ కూటమి భాగస్వామ్య పక్షాల విజయానికి డీఎంకే కృషి చేస్తుందని సీఎం స్టాలిన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని