Pawan Kalyan: నా మనసుకు దగ్గరగా ఉన్న శాఖలివి

జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా గ్రామాలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీశాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

Published : 16 Jun 2024 06:50 IST

గ్రామీణుల దాహార్తి తీరుస్తా
కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు
ఉపాధి హామీ నిధులతో మౌలిక వసతుల కల్పనకు కృషి
అడవుల వినాశనానికి పాల్పడితే కటకటాలే
ఉప ముఖ్యమంత్రి; పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌
ఈనాడు - అమరావతి

జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా గ్రామాలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీశాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామని చెప్పారు. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. అడవుల వినాశనానికి పాల్పడినా, అందుకు ప్రయత్నించినా ఎంతటివారైనా సరే కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తానని శనివారం ఒక ప్రకటనలో పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను నిర్వర్తించబోయే శాఖలన్నీ నా మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ బాధ్యతలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే శాఖలను నాకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా. 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నేను తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించా. 2019 ఎన్నికలకు ముందు ప్రజా పోరాట యాత్రను ప్రజల సమస్యలపై అవగాహన, మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం కోసమే తలపెట్టాను. రాష్ట్రంలోని ప్రతి ప్రాంత సమస్యలపైనా బలమైన అవగాహన ఏర్పడింది’ అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

గ్రామాల్లో సమస్యలు కళ్లారా చూశా 

‘విశాఖ మన్యంలో పర్యటించినప్పుడు కురిడి గ్రామంలో ఆడపడుచులు గుక్కెడు నీళ్ల కోసం పడుతున్న అవస్థలు చెబుతూ...అక్కడి బావిలో కలుషితమైపోయిన నీటిని చూపించారు. గోదావరి జిల్లాల్లోని పలు మత్స్యకార గ్రామాల్లో మంచినీటి కోసం బిందె నెత్తిన పెట్టుకుని మైళ్ల దూరం నడిచి వెళుతున్న ఆడపడుచుల అవస్థలు చూశాను. కాలుష్యమయమైన జలాల్నే తప్పనిసరి పరిస్థితుల్లో తాగునీరుగా వాడుకుంటున్న గ్రామీణ ప్రజల కష్టాల్ని గమనించాను. గత ఏడాది సర్పంచులతో జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న వందల మంది సర్పంచులు గత రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధులను ఎలా మళ్లించేసిందో చెప్పారు. నిధులు, అధికారాలు లేక తాము ఏ విధంగా చేష్టలుడిగిపోయామో వివరించారు’ అని మంత్రి పేర్కొన్నారు.

అటవీ సంపదను కాపాడుకుందాం

‘అడవుల విధ్వంసమే కరవు కాటకాలకు హేతువు. అడవులను కంటికి రెప్పలా కాపాడటమే కాదు.. అటవీ సంపద అక్రమ రవాణా విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ఒక్క వృక్షాన్ని రక్షించుకుంటేనే మానవకోటికి ఎంతో మేలు కలుగుతున్నప్పుడు.. లక్షలాది వృక్షాలను తన గర్భాన నిలుపుకున్న అడవి తల్లిని కాపాడుకుంటే ఎంతో మేలు. శాస్త్ర, సాంకేతిక విభాగాలు మానవాళి శ్రేయస్సుకు, లోక కల్యాణానికి అత్యంత అవశ్యం’ అని మంత్రి పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు.

పర్యావరణం జనసేన సిద్ధాంతాల్లో భాగం 

‘పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే అభివృద్ధి ప్రస్థానం’ అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. ఒకపక్క పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందాలని గట్టిగా కోరుకుంటాను. ఆ అభివృద్ధి పర్యావరణానికి హితంగా జరగాలి. ఆధునిక సాంకేతికత మేళవించిన సురక్షితమైన పారిశ్రామికాభివృద్ధి  సమాజానికి అవసరం. విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదాన్ని మనం ఏనాడూ మరచిపోలేం. ప్రజల ఆరోగ్యాలను హరించివేయకుండా పరిశ్రమలు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకునేలా ముందుకెళ్లడానికి చేయూతనిస్తాం. భూతాపాన్ని తగ్గించడానికి ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలుస్తాం. గ్రీన్‌ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తాం’ అని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. 

ప్రజా ప్రయోజనం, అభివృద్ధి సంబంధిత శాఖలు 

‘జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు ప్రజా ప్రయోజనం కలిగిన, అభివృద్ధి సంబంధిత పౌరసరఫరాలు, పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించడం సంతోషంగా ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేస్తాం. రైతుల నుంచి పంటల కొనుగోలు విధానం, వారికి సొమ్ములు చెల్లించడంలో మెరుగైన విధానాలు అవలంబిస్తాం. వరి రైతులకు పంట కొనుగోలు డబ్బులు అందించడంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, రైతులు పడిన వేదనను కళ్లారా చూశాను. ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితులు రానీయం. పర్యాటకాభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆహ్లాదకర పర్యాటకంతోపాటు ధార్మిక, ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధిపై దృష్టి పెడతాం. పర్యాటక కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించడంతోపాటు రాష్ట్రానికి ఒక బ్రాండ్‌ సృష్టించడంపై దృష్టి పెట్టాలి. సినిమా రంగానికి రాష్ట్రంలో ప్రోత్సాహకర, స్నేహపూరిత వాతావరణం తీసుకొస్తాం. చిత్రీకరణ ప్రాంతాల్లో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఈ రంగంలో రాష్ట్ర యువతకు ఉపాధి దక్కేలా చూస్తాం’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని