గాయపడిన పులితో ఆట ప్రమాదకరం: మమత

కేంద్రం దర్యాప్తు సంస్థల్ని తనపైకి పంపించి కుట్ర చేయాలని ప్రయత్నిస్తోందని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ మేరకు ఆమె మంగళవారం మేజియాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో మాట్లాడారు.

Updated : 16 Mar 2021 17:35 IST

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని తనపైకి పంపించి కుట్ర చేయడానికి ప్రయత్నిస్తోందని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ మేరకు ఆమె మంగళవారం మేజియాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో మాట్లాడారు. భాజపా అధికారంలోకి వచ్చేందుకు కుట్రలకు పాల్పడుతోందని ఈ సందర్భంగా దీదీ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

‘భాజపా అధికారంలోకి వస్తే ప్రజల గొంతుల్ని అణచివేస్తుంది. ఎన్నికలు వచ్చాయంటే చాలు వారు(భాజపా) తమ సభల్లో పాల్గొనడానికి జనాల్ని.. డబ్బులిచ్చి కొంటారు. ఎందుకంటే వారికి ప్రజల మద్దతు లేదు. భాజపాపై నా పోరాటాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తా. మార్చి 27న వారి ఆట మొదలవుతుంది. సీబీఐ, ఈడీలను నా మీదకు పంపించి కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ.. ప్రజలు ప్రశాంతంగా ఓటింగ్‌లో పాల్గొని వారి కుట్రల్ని తిప్పికొట్టాలి’ అని బెనర్జీ అన్నారు.

‘భాజపా ఎన్నికల ప్రచార సభలకు ప్రజల నుంచి స్పందన కరవవడాన్ని అమిత్‌ షా జీర్ణించుకోలేకపోతున్నారు. దేశాన్ని నడిపించాల్సిన మంత్రి, కోల్‌కతాలో కూర్చొని తృణమూల్‌ నేతలను వేధించేందుకు కుట్రలు పన్నుతున్నారు. వాళ్లకు ఏం కావాలి? నన్ను చంపాలని అనుకుంటున్నారా? తద్వారా ఈ ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నారా? అలా ఆలోచించడం అవివేకం’ అని మమతా బెనర్జీ భాజపాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. నందిగ్రామ్ సభలో గాయపడ్డ అనంతరం తన వ్యక్తిగత భద్రతాధికారి (వివేక్‌ సహాయ్‌)ని ఎన్నికల సంఘం తొలగించడాన్ని దీదీ తప్పుబట్టారు. అంతేకాకుండా ఎన్నికల సంఘాన్ని అమిత్‌ షా నియంత్రిస్తున్నారా? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ భాజపాపై తాను చేస్తోన్న పోరాటాన్ని ఎవ్వరూ ఆపలేరని బెంగాల్‌ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇటీవల తన కాలికి తగిలిన గాయాన్ని ఉద్దేశిస్తూ.. గాయపడిన పులితో ఆట ఎంతో ప్రమాదకరమని దీదీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన కాలికి గాయం అయినా.. బెంగాలీ బిడ్డల సాయంతో ఎన్నికల సమరంలో పోరాటం చేస్తానని దీదీ ధీమా వ్యక్తం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని