Gujarat polls: మోదీజీ.. కాంగ్రెస్‌ని తిట్టడం ఆపి వాటిపై మాట్లాడండి: ప్రధానికి ఖర్గే కౌంటర్‌

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు(Gujarat election2022) సమీపిస్తుండటంతో ప్రచార వేడి కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Published : 25 Nov 2022 01:38 IST

దిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు(Gujarat election2022) సమీపిస్తుండటంతో ప్రచార వేడి కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. కాంగ్రెస్‌ను తిట్టడం ఆపి గుజరాత్‌లో భాజపా దుష్పరిపాలన గురించి ప్రధాని మాట్లాడితే బాగుంటుందని ఆయన హితవు పలికారు. గుజరాత్‌లోని మెహసానాలో భాజపా అభ్యర్థి తరఫున బుధవారం ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీ మహిళను బరిలో దించితే కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వలేదంటూ ప్రతిపక్ష పార్టీని టార్గెట్‌ చేస్తూ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా గత కాంగ్రెస్‌ పాలనలో ఓటు బ్యాంకు రాజకీయాలే నడిచాయని.. బంధుప్రీతి, ఒంటెద్దు పోకడలతో సంఘ విద్రోహ శక్తులకు మద్దతుగా నిలిచిందంటూ విమర్శలు గుప్పించారు. దీంతో ప్రధాని వ్యాఖ్యలకు మల్లిఖార్జున ఖర్గే ట్విటర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. మోదీ జీ.. కాంగ్రెస్‌ను తిట్టడం ఆపి భాజపా దుష్పరిపాలన గురించి మాట్లాడండంటూ సూచించారు. గుజరాత్‌లో చిన్నారుల భవిష్యత్తును ఎందుకు నాశనం చేశారు? పోషకాహార లోపం, తక్కువ బరువు కలిగిన పిల్లలు ఉన్న 30 రాష్ట్రాల జాబితాలో గుజరాత్‌ ఎందుకు 29వ స్థానంలో ఉంది? శిశుమరణాల్లో గుజరాత్‌ 19వ స్థానంలో ఉంది ఎందుకని? అంటూ పలు ప్రశ్నలు సంధించారు. గత 27 ఏళ్లుగా జవాబుదారీతనంతో సమాధానం చెప్పాలని గుజరాత్‌ డిమాండ్‌ చేస్తోందని ఖర్గే పేర్కొన్నారు. 

మొత్తం 182 మంది సభ్యులు కలిగిన గుజరాత్‌ అసెంబ్లీకి రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 1న 89 సీట్లకు తొలి విడతలో పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌ 5న 93 సీట్లకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 1621మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డిసెంబర్‌ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని