Hardik Patel: మా పార్టీలో చేరండి.. హార్దిక్‌ పటేల్‌కు ఆమ్‌ ఆద్మీ పిలుపు

గుజరాత్‌కు చెందిన యువ నేత, ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్‌ పటేల్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించింది ఆప్‌. కాంగ్రెస్‌ లాంటి పార్టీలో మీలాంటి వారు ఉండకూడదని సూచించింది.......

Updated : 16 Apr 2022 04:28 IST

దిల్లీ: గుజరాత్‌లో మరికొద్ది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ పూర్తిస్థాయి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గుజరాత్‌కు చెందిన యువ నేత, ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్‌ పటేల్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించింది ఆప్‌. కాంగ్రెస్‌ లాంటి పార్టీలో మీలాంటి వారు ఉండకూడదని సూచించింది. ఆమ్‌ ఆద్మీ గుజరాత్‌ అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా మాట్లాడుతూ.. ‘హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌ను ఇష్టపడకపోతే.. ఆయన మా పార్టీలో చేరాలి. కాంగ్రెస్‌ తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం, సమయం వృథా చేయడం కంటే.. మా పార్టీకి సేవలందించడం ఉత్తమం. కాంగ్రెస్ లాంటి పార్టీలో మీలాంటి అంకితభావం ఉన్న వ్యక్తులకు స్థానం ఉండదు’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ విధివిధానాలపై హార్దిక్‌ పటేల్‌ అసంతృప్తితో ఉన్నారని వస్తున్న వార్తల నేపథ్యంలోనే గోపాల్‌ ఇటాలియా ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ యూనిట్ నిర్వహించిన ఏ సమావేశానికీ తనను ఆహ్వానించలేదని, నిర్ణయాలు తీసుకునే ముందు సంప్రదించలేదని హార్దిక్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు విషయాలపై కాంగ్రెస్‌ అధిష్టానానికి ఈ యువనేత ఫిర్యాదు చేశారని, అవమానాలకు గురిచేయొద్దని కోరినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే హార్దిక్‌ పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లను హార్దిక్‌ కొట్టిపారేశారు. ‘నేను పార్టీ మారనున్నట్లు తప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. వాటిల్లో ఎలాంటి నిజం లేదు’ అని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ అభివృద్ధికి 100శాతం పనిచేశా. ఇకపై కూడా అలాగే పనిచేస్తా. గుజరాత్‌లో పార్టీ మరింత పుంజుకునేందుకు శ్రమిస్తా. పార్టీలో చిన్నచిన్న తగాదాలు, నిందారోపణలు ఉండటం సహజం. గుజరాత్‌ను ఉత్తమంగా మార్చేందుకు కలిసికట్టుగా పనిచేస్తాం’ అని హార్దిక్‌ ఓ జాతీయ మీడియాకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని