Pocharam Srinivas Reddy: పోచారం నివాసం వద్ద ఉద్రిక్తత

మాజీ సభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసం వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. భారాస నేతలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Updated : 22 Jun 2024 04:49 IST

లోపలికి చొచ్చుకెళ్లేందుకు భారాస నేతల యత్నం
12 మంది అరెస్ట్‌.. బెయిల్‌ మంజూరు

బంజారాహిల్స్‌ ఠాణా వద్ద మాజీ ఎమ్మెల్యేలు, బాల్క సుమన్, క్రాంతి, భారాస కార్యకర్తలు 

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: మాజీ సభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసం వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. భారాస నేతలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాంగ్రెస్‌లో చేరికపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పోచారం నివాసానికి చేరుకుని ఆయనతో చర్చిస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, భారాస నేతలు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బాలరాజు యాదవ్‌ తదితరులు అక్కడికి వచ్చారు. పోలీసులు తేరుకొనే లోపే వారంతా ఇంటి గేటు లోపలికి ప్రవేశించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అడ్డగించారు. అక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకొంది. కొందరు పోచారానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. బంజారాహిల్స్‌ ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారాస నాయకులను స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న భారాస హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, గోషామహల్‌ భారాస ఇన్‌ఛార్జి ఆశిష్‌యాదవ్‌ బంజారాహిల్స్‌ ఠాణాకు చేరుకున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన నేతలను ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ మాగంటి గోపీనాథ్‌ ప్రశ్నించారు. 

బాల్కసుమన్‌ సహా 12 మందిపై కేసు 

పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 12 మందిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, దూదిమెట్ల బాలరాజు యాదవ్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, కె.వాసుదేవరెడ్డి, ఆంజనేయ గౌడ్, కడారి స్వామి యాదవ్, తుంగ బాలు, డి.రాజు, కె.జంగయ్య, వరికుప్పల వాసు, చట్టారి దశరథ్‌లపై కేసు నమోదు చేసి నాంపల్లిలోని మూడో అదనపు మెట్రోపాలిటన్‌ క్రిమినల్‌ కోర్టులో హాజరుపర్చగా రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. అంతకుముందు వారిని కోర్టుకు తీసుకెళ్లే సమయంలో భారాస కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు బంజారాహిల్స్‌ ఠాణా వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.

నిఘా వర్గాల ఆరా..

పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త ఘటనపై ప్రభుత్వ నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ముఖ్యమంత్రి వచ్చిన సమయంలో పోలీసు ఉన్నతాధికారులు లేకపోవడంతో బందోబస్తు వైఫల్యం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు