AP News: మరోసారి తెరపైకి ఎర్రజెండా పార్టీల విలీనం అంశం!

కమ్యూనిస్టు పార్టీల ఐక్యత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర మహాసభల్లో ఈ అంశంపై  ఆసక్తికర చర్చ

Published : 27 Dec 2021 19:54 IST

సీపీఎం రాష్ట్ర మహాసభల్లో ఆసక్తికర చర్చ!

గుంటూరు: కమ్యూనిస్టు పార్టీల ఐక్యత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర మహాసభల్లో ఈ అంశంపై  ఆసక్తికర చర్చ జరిగింది. ఈ మహాసభలకు ప్రత్యేక అహ్వానితులుగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కమ్యూనిస్టులు కలవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. 2005లో నల్గొండలో జరిగిన మహాసభల్లో బీవీ రాఘవులు ఈ ప్రతిపాదన చేశారని... కానీ ఇప్పటికీ ముందడుగు పడలేదన్నారు. రామకృష్ణ ప్రసంగం తర్వాత బీవీ రాఘవులు ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. రాజకీయం కోసమో.. ఓట్లు-సీట్లు కోసమో లెఫ్ట్ పార్టీలు ఐక్యమైతే లాభం లేదన్నారు. రెండు పార్టీల విధానాలు కలిసినప్పుడే ఐక్యత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కేవలం సెంటిమెంట్‌తో ఐక్యత సాధ్యం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి ఐకాస తిరుపతిలో నిర్వహించిన సభలో భాజపా పాల్గొంది గనకే తాము పాల్గొనలేదన్న బీవీ రాఘవులు... రైతు సంఘాల జాతీయ నేత టికాయిత్‌ని ఆహ్వానించి ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. 

పీడిత వర్గాలన్నీ కమ్యూనిస్టులు కలవాలనే అభిప్రాయంతో ఉన్నాయని రామకృష్ణ ప్రతిసమాధానమిచ్చారు. ఐక్యతపై ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభిస్తే.. వచ్చే ఏడాది జరిగే సీపీఐ, సీపీఎంల జాతీయ మహాసభల నాటికి ఈ అంశం ఓ కొలిక్కి వస్తుందని చెప్పారు. రాజధాని సభకు దూరంగా ఉంటే భాజపా సంతోషిస్తుందని.. ఆ అవకాశం వాళ్లకు ఎందుకివ్వాలన్నారు. రెండు పార్టీలు కలిసే విధానాలపై చర్చ జరగాలని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఏకం కావాలి: ఏచూరి 

దేశంలో మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయ పక్షాలు, అన్నివర్గాల ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరుగుతున్న సీపీఎం 23వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వీడాలన్నారు. భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడితేనే దేశంలోప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని ఏచూరి అన్నారు. ఇందుకు  వైకాపా సర్కార్‌ కూడా చొరవతీసుకోవాలన్నారు. 

జగన్‌ సర్కార్‌ లాలూచీ రాజకీయాలు చేస్తోంది.. మధు

రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఈ మూడు రోజుల సమావేశాల్లో చర్చించి పోరాట కార్యాచరణను రూపొందించనున్నారు. రాజధాని విధానానికి స్వస్తి చెప్పి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తీర్మానం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. విభజన హామీల అమలులో భాజపా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆక్షేపించారు. జగన్‌ సర్కార్‌ భాజపాతో లాలూచీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని