Dimple Yadav: పోలింగ్‌లో రిగ్గింగ్‌.. కలెక్టర్‌ ఫోన్‌ తీయట్లేదు: డింపుల్‌ యాదవ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి సోమవారం ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఎస్పీ అభ్యర్థి డింపుల్‌ యాదవ్‌ ఆరోపించారు.

Updated : 05 Dec 2022 11:53 IST

మెయిన్‌పురి: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) లోని మెయిన్‌పురి (Mainpuri) లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి డింపుల్‌ యాదవ్‌ (Dimple Yadav) ఆరోపించారు. దీనిపై ఫిర్యాదులు చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ‘‘ఎన్నికల్లో రిగ్గింగ్‌ గురించి ఫిర్యాదులు చేసేందుకు ఎస్పీ కార్యకర్తలు ప్రయత్నిస్తుంటే.. మెయిన్‌పురి కలెక్టర్‌ ఫోన్‌ తీయట్లేదు. దీనిపై ఎన్నికల కమిషనర్‌ చర్యలు తీసుకోవాలి’’ అని డింపుల్‌ ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఓటేసిన అఖిలేశ్‌ యాదవ్‌..

ఈ ఎన్నికల్లో ఎస్పీ (Samajwadi Party) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమ స్వస్థలం సైఫైలోని అభివన్‌ విద్యాలయ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాల్లో ఓట్లు వేసేందుకు పోలీసులు ప్రజలకు అనుమతినివ్వట్లేదని తనకు ఫిర్యాదులు అందుతున్నట్లు తెలిపారు. ‘‘అధికారులు ఎవరి ఆదేశాలపై పనిచేస్తున్నారో అర్థం కావట్లేదు’’ అంటూ భాజపాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక (Mainpuri Bypoll) అనివార్యమైంది. ఈ స్థానం నుంచి ములాయం కోడలు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ సతీమణి డింపుల్‌ బరిలోకి దిగారు. ఈమెకు ప్రత్యర్థిగా భాజపా నుంచి మాజీ ఎంపీ రఘురాజ్‌ సింగ్ శాఖ్య పోటీలో ఉన్నారు. సోమవారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 11 గంటల వరకు 18.72శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

మెయిన్‌పురితో పాటు ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా నేడు ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగుతోంది. అటు గుజరాత్‌లోనూ రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలను డిసెంబరు 8న ప్రకటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని