మీరేమైనా ‘దేవుడా’ లేక ‘మానవాతీతులా’: దీదీ

బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రత్యర్థుల విమర్శలు, ప్రత్యారోపణలతో అక్కడి రాజకీయం రంజుగా సాగుతోంది. ..

Published : 05 Apr 2021 01:23 IST

కోల్‌కతా: బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రత్యర్థుల విమర్శలు, ప్రత్యారోపణలతో అక్కడి రాజకీయం రంజుగా సాగుతోంది. ఆదివారం హుగ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీని తృణమూల్ అధినేత్రి దీదీ తూర్పారబట్టారు. ఎన్నికల జోస్యం చెప్పడానికి మీరేమైనా ‘దేవుడా’ లేక మానవాతీతులా (సూపర్‌హ్యుమన్‌) అని ఘాటుగా విమర్శించారు. బెంగాల్‌లో మరో ఆరు విడతల ఎన్నికలు మిగిలే ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. 

శనివారం ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. బెంగాల్‌లో భాజపా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరువుతానని, వీలైనంత తర్వాత అక్కడ పీఎం కిసాన్‌ నిధి అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక 2024 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నుంచి తనకు ప్రత్యర్థిగా దీదీ పోటీ చేయబోతున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయని, దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత ఎన్నికల్లో టీఎంసీ ఓటమిని అంగీకరించినట్లు నిర్ధారణ అవుతుందని ఎద్దేవా చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను దీదీ ఇవాళ పైవిధంగా తిప్పికొట్టారు. అలాగే ఎన్నికల లబ్ధికోసం హోంమంత్రి షా పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఈసీకి సూచనలు ఇస్తూ వాడుకుంటున్నారని ఆరోపించారు.

బంగ్లా బంధు షేక్ ముజీబూర్ రెహ్మాన్ శతాబ్ది జన్మదిన వేడుకలకు బంగ్లాదేశ్‌లో మోదీ పర్యటించడం అక్కడ అల్లర్లకు దారితీసిందని దీదీ ఆరోపించారు. మరోవైపు ఇండియన్‌ సెక్యూలర్‌ ఫ్రంట్‌(ఐఎస్‌ఎఫ్‌)పై మమత విరుచుకుపడ్డారు. ఎవరి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకుండా.. ఓ వ్యక్తి భాజపా ఇచ్చిన నోట్ల తిని మైనార్టీ ఓట్లు విభజించడానికి బయలుదేరాడని అన్నారు. అతనెప్పుడు విబేధాలు సృష్టించేలా మతతత్వ ప్రకటనలు చేస్తాడని, దీనిని తృణమూల్‌ ఎక్కువ కాలం కొనసాగించబోదని మండిపడ్డారు. కాగా, కాంగ్రెస్‌, వామపక్షాలు కూటమితో కలిసి ఐఎస్‌ఎఫ్‌ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం గమనార్హం.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని