Maharashtra: ‘మహా’ రాజకీయ సంక్షోభం.. పార్టీల బలాబలాలు ఇలా..

మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి సంక్షోభం అంచునకు వెళ్లింది. రాష్ట్ర మంత్రి, శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే, తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటా ఎగురవేసేందుకు

Published : 21 Jun 2022 14:27 IST

ముంబయి: మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి సంక్షోభం అంచునకు వెళ్లింది. రాష్ట్ర మంత్రి, శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే, తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. వీరంతా ప్రస్తుతం గుజరాత్‌లో ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. షిండే వర్గం భాజపాలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది లేదా కొత్త పార్టీ కూడా పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ఠాక్రే సర్కారు బలం తగ్గి మెజార్టీ కోల్పోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే, ఉద్ధవ్‌ ఠాక్రే శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మరి.. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ప్రధాన పార్టీలకు ఉన్న బలమెంత..? షిండే ప్రభావంతో సమీకరణాలు ఎలా మారనున్నాయి..? చూద్దాం..!

  1. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 288. ఇందులో ఒక శివసేన ఎమ్మెల్యే ఇటీవల మరణించారు. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 287గా ఉంది. అసెంబ్లీలో మెజార్టీ మార్క్‌ 144 దాటాలి.
  2. ప్రస్తుతం మహా వికాస్‌ అఘాడీ కూటమి సంఖ్యా బలం 152. ఇందులో శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు కొన్ని చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు తమకు ఉందని కూటమి చెబుతోంది. 
  3. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం 22 మంది సూరత్‌లోని ఓ హోటల్‌లో ఉన్నారు. ఏక్‌నాథ్‌ షిండే సహా వీరంతా రాజీనామా చేస్తే శివసేన సంఖ్యా బలం 33కు తగ్గుతుంది. అప్పుడు సంకీర్ణ ప్రభుత్వ బలం కూడా 130కి పడిపోతుంది. 
  4. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 265కు తగ్గుతుంది. అప్పుడు మెజార్టీ మార్క్‌ 133గా ఉంటుంది. 
  5. ప్రస్తుతం అసెంబ్లీలో భాజపాకు 106 మంది సభ్యుల బలం ఉంది. అయితే, స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతో తమకు 135 మంది సభ్యుల బలముందని కాషాయ పార్టీ చెబుతోంది. అంటే మెజార్టీ మార్క్‌ కంటే ఇద్దరు ఎక్కువగానే ఉన్నారు. 

మరి తాజా పరిస్థితుల్లో ఏక్‌నాథ్‌ షిండే ఏ నిర్ణయం తీసుకుంటారో.. సంకీర్ణ ప్రభుత్వం నిలబడుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని