Siddaramaiah: సీఎం పదవి ఏమైనా పేమెంట్‌ సీటా?

రూ.2500 కోట్లు ఇస్తే తనకు సీఎం పదవి ఇస్తామని కొందరు ఆఫర్‌ చేసినట్టు భాజపా ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు.....

Published : 08 May 2022 02:16 IST

బెంగళూరు: రూ.2500 కోట్లు ఇస్తే తనకు సీఎం పదవి ఇస్తామని కొందరు ఆఫర్‌ చేసినట్టు భాజపా ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య భాజపాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం పదవి ఆశించే వారి నుంచి డబ్బులు అడిగినట్టు వచ్చిన ఆరోపణలు వాస్తవమేనా? అని నిలదీశారు. దిల్లీ నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు సీఎం పదవి కోసం రూ.2500 కోట్లు అడిగారంటూ ఎమ్మెల్యే యత్నాల్‌ చేసిన వ్యాఖ్యలపై సరైన దర్యాప్తు జరిపిస్తేనే అసలు నిజమేంటో బయటకు వస్తుందన్నారు. ‘‘సీఎం పదవి ఏమైనా పేమెంట్‌ సీటా?’’ అని సిద్ధరామయ్య ప్రశ్నించారు.

ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపకపోతే మాత్రం.. బసవరాజ్‌ బొమ్మై సీఎం కావడానికి రూ.కోట్లు చెల్లించినట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. భాజపాలో అక్రమాలపై బసనగౌడ యత్నాల్‌ వద్ద చాలా సమాచారం ఉందనీ.. ఆయన్ను విచారిస్తే అనేక నిజాలు వెలుగుచూస్తాయన్నారు. భాజపాలో ముఖ్యమంత్రిని శాసనసభాపక్ష పార్టీయే ఎన్నుకొంటుందనే భావనలో ప్రజలు ఉన్నారన్న సిద్ధరామయ్య.. ఇప్పుడు సీఎం కుర్చీని వేలం ద్వారా కొనుగోలు చేసినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్ చెబుతున్నారని మండిపడ్డారు. గతంలో భాజపా సీఎంలు ఎంత మొత్తాన్ని ఖర్చు చేశారో కూడా చూడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మంత్రి బెర్త్‌లతో పాటు అన్ని పదవులకూ రేట్లు నిర్ణయించారన్నారు. సివిల్‌ కాంట్రాక్టర్ల నుంచి 40శాతం కమీషన్‌, పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నియామకాల్లో అవకతవలు వంటి భాజపా సర్కార్‌ కుంభకోణాలకు.. యత్నాల్‌ చేసిన ఆరోపణలకు సంబంధం ఉందని సిద్ధరామయ్య ఆరోపించారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇటీవల ఉడుపిలో జరిగిన సివిల్‌ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య ఘటనను ప్రస్తావిస్తూ.. సీఎం, మంత్రులు అయ్యేందుకు డబ్బులు చెల్లించిన వారు కమీషన్‌ వ్యాపారంలోకి దిగారనీ.. ఇది ఒక అమాయకుడి ప్రాణం పోయేందుకు దారితీసిందని సిద్ధరామయ్య అన్నారు. సీఎంలు, మంత్రులు అవినీతికి పాల్పడినట్టుగా ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్‌ ఆరోపించడం కొత్తేమీ కాదన్న సిద్ధరామయ్య.. దీనిపై భాజపా హైకమాండ్‌ ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని