Published : 08 Aug 2022 13:13 IST

BJP Vs JDU: భాజపాతో బంధానికి బీటలు.. సోనియాకు నీతీశ్‌ కాల్‌ చేశారా..?

(నీతీశ్ ట్విటర్ ఖాతా నుంచి)

పట్నా: బిహార్‌ అధికార కూటమి జేడీయూ, భాజపాలో సంక్షోభం ముదురుతోంది. ఏ క్షణమైనా కమలం పార్టీతో నీతీశ్ కుమార్ పార్టీ తెగదెంపులు చేసుకునేలా పరిణామాలు మారుతున్నాయి. జేడీయూ పార్టీ మాజీ నేషనల్ ప్రెసిడెంట్‌, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌సీపీ సింగ్ రాజీనామాతో సంకీర్ణ కూటమి బంధం మరింత బీటలు వారింది. బిహార్‌ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధినేత్రికి ఫోన్‌ చేశారనే వార్తలు, ఆయన పట్ల ఆర్జేడీ మృదువైఖరితో కొత్త పొత్తులు ఉదయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే రేపు జేడీయూ తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం కీలకంగా మారనుంది.

25 రోజుల వ్యవధిలో 4 సమావేశాలకు గైర్హాజరు..

ఆదివారం ప్రధాని మంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి నీతీశ్‌ గైర్హాజరయ్యారు. ఇటీవల కొవిడ్ బారినపడిన నీతీశ్‌ నీరసంగా ఉండటం వల్లే నీతిఆయోగ్ సమావేశానికి హాజరుకాలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే అయన అదేరోజు పట్నాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. గతకొద్దికాలంగా భాజపా, జేడీయూ మధ్య సఖ్యత లేదని వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేసేలా జులై 17 నుంచి జరిగిన నాలుగు సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరు కాలేదు. ఈ పరిణామాల మధ్య ఆగస్టు 11లోగా కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అలాగే జేడీయూకు చెందిన ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు వెళ్లడానికి సుముఖత చూపడం లేదు. దాంతో ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో పొత్తు పెట్టుకొని అధికారాన్ని కాపాడుకుంటారనే అంచనాలు వెలువడుతున్నాయి. 

ఆజ్యం పోసిన ఆర్‌సీపీ సింగ్‌..

జేడీయూ నేత ఆర్‌సీపీ సింగ్ రాజీనామాతో కాషాయ పార్టీ, నీతీశ్‌ బంధానికి మరింత బీటలువారాయి. అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సింగ్‌ను జేడీయూ ఆదేశించిన నేపథ్యంలో ఆయన శనివారం పార్టీని వీడారు. కొద్ది నెలలుగా బిహార్ ముఖ్యమంత్రికి, సింగ్‌కు పొసగడం లేదని, అలాగే ఆయనకు భాజపాతో అనుబంధం పెరిగిందని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఈ నేతను నీతీశ్‌ మూడోసారి రాజ్యసభకు నామినేట్‌ చేయకపోవడంతో.. ఆయన కేంద్ర కేబినెట్‌ నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామం సింగ్‌ను సొంతపార్టీకి మరింత దూరం చేసింది. ఈ నేపథ్యంలో లోక్‌జనశక్తి పార్టీని చీల్చిన మాదిరిగానే.. తమ పార్టీని చీల్చాలని కమలం పార్టీ కుట్ర చేస్తోందని జేడీయూ నేషనల్ ప్రెసిడెంట్ లాలన్ సింగ్ ఆరోపించారు. సింగ్ రాజీనామాపై మాట్లాడుతూ.. ‘ఆయన నిన్ననే పార్టీని వీడి ఉండొచ్చు. కానీ చాలాకాలంగా ఆయన మనసు ఎక్కడో ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. 

సోనియాకు నీతీశ్‌ ఫోన్‌..!

ఈ సంక్షోభ సమయంలో నీతీశ్‌ కుమార్‌ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా దానికి హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి నీతీశ్‌ ఫోన్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ వీటిని ఖండించింది. మరోపక్క ఆర్జేడీతో పొత్తుపై ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో లాలూ పార్టీ నీతీశ్‌పై అనుకూల వైఖరిని కనబరుస్తోంది. ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కొద్దికాలంగా సంప్రదింపులు జరుపుతున్నారని, ఆగస్టు 11లోగా సరికొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పేలా వీరు ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో మిగిలిన పార్టీలు కూడా అప్రమత్తమవుతున్నాయి.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts