Gujarat polls: గుజరాత్‌లో ఆప్‌ సీఎం అభ్యర్థిగా మాజీ టీవీ యాంకర్‌

పంజాబ్‌ తరహాలోనే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 04 Nov 2022 16:07 IST

దిల్లీ: పంజాబ్‌ తరహాలోనే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా టీవీ యాంకర్‌గా పనిచేసిన ఇసుదాన్‌ గఢ్వీని ఎంపిక చేసింది. ఈ మేరకు ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం ప్రకటించారు. పంజాబ్‌ తరహాలోనే గుజరాత్‌లోనూ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఆప్‌ నిర్వహించిన పోల్‌లో 40 ఏళ్ల గఢ్వీకి 73 శాతం ఓట్లు వచ్చాయని కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఈ రేసులో పాటిదార్ కమ్యూనిటీ ఆందోళనలో కీలక పాత్ర పోషించిన ఆప్‌ గుజరాత్‌ ఇన్‌ఛార్జి గోపాల్ ఇటాలియా కూడా ఉన్నప్పటికీ.. గుజరాతీలు గఢ్వీ వైపే మొగ్గు చూపారు.

గఢ్వీ ద్వారకా జిల్లా పిపాలియా గ్రామంలోని ఓ రైతు కుటుంబంలో జన్మించారు. అలాగే, గుజరాత్‌ జనాభాలో 48శాతంగా ఉన్న ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. అయితే, పంజాబ్‌లో భగవంత్‌ మాన్‌ను సీఎం అభ్యర్థిగా ఎంచుకున్న చందంగానే గుజరాత్‌లోనూ ఆప్‌ ఓ ఫోన్‌ నంబర్‌ను ఏర్పాటు చేసి ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది. గఢ్వీ గుజరాత్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన టీవీ జర్నలిస్టు, యాంకర్లలో ఒకరుగా ఉన్నారు.

గఢ్వీ భావోద్వేగం..

గతేడాది జూన్‌లోనే ఆప్‌లో చేరిన 40 ఏళ్ల గఢ్వీ.. తన పేరును సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్‌ ప్రకటించడంతో ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘నాలాంటి రైతు బిడ్డకు కేజ్రీవాల్‌ ఇంత పెద్ద బాధ్యత అప్పగించారు. నేను చేయగలిగనంత మంచి చేస్తాను. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు నా తోటి గుజరాతీలకు అవసరమైనవి ఇవ్వాలనుకుంటున్నా. నా తుది శ్వాస దాకా ప్రజలకు సేవ చేస్తా’’ అని వ్యాఖ్యానించారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్‌ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని