Cong polls: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గేదే విజయం.. గహ్లోత్‌ ధీమా

Cong polls: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులో ఉన్న సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేనే విజయం వరిస్తుందని అశోక్‌ గహ్లోత్‌ అన్నారు. ఆయనకు పార్టీని బలోపేతం సామర్థ్యం ఉందన్నారు.

Updated : 02 Oct 2022 12:36 IST

జైపుర్‌: కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసే సామర్థ్యం సీనియర్‌ నేత, ఎంపీ మల్లికార్జున ఖర్గేకు ఉందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారని ఆదివారం ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోటీలో ఉన్న మరో నేత శశిథరూర్‌ను ‘ఉన్నత వర్గానికి’ చెందిన వ్యక్తిగా గహ్లోత్‌ అభివర్ణించారు. 

‘‘ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన దళిత వర్గం నుంచి వచ్చిన ఓ సహృదయ నేత. ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. థరూర్‌ కూడా మంచి వ్యక్తే. ఆయనకూ మంచి ఆలోచనలు ఉన్నాయి. కానీ, ఆయన ఉత్నత వర్గానికి చెందినవారు. అలాగే పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కావాల్సిన అనుభవం ఖర్గేకు ఉంది. ఈ విషయంలో థరూర్‌ను ఖర్గేతో పోల్చలేం. అందువల్ల సహజంగానే  పోటీ ఖర్గే వైపు ఏకపక్షంగా సాగుతుంది’’ అని గహ్లోత్‌ అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ మాత్రమే మిగిలారు. శనివారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కె.ఎన్‌.త్రిపాఠి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 8 వరకు గడువు ఉంది. అప్పటిలోగా ఉపసంహరణలేమీ లేకపోతే 17న పోలింగ్‌ జరుగుతుంది. ఎన్నికల బరిలో అధికారిక అభ్యర్థి ఎవరూ ఉండరని గాంధీ కుటుంబం తనకు చెప్పినట్లు థరూర్‌ శనివారం వెల్లడించారు. మరోవైపు రాజ్యసభ విపక్ష నేత పదవికి మల్లికార్జున ఖర్గే రాజీనామా చేశారు. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే తీర్మానంలో భాగంగా ఈ మేరకు లేఖను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. ఈ పదవిని సీనియర్‌ నేతలు పి.చిదంబరం, లేదా దిగ్విజయ్‌సింగ్‌కు పార్టీ అప్పగిస్తుందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని