PM Modi: ఆ కళ నాకు మాత్రమే తెలుసు.. ఉచిత విద్యుత్‌పై ప్రధాని మోదీ..!

గుజరాత్‌లో ఉచితంగా విద్యుత్తు ఇవ్వడానికి బదులు.. దాని ద్వారా ప్రజలు ఆదాయాన్ని పొందే మార్గాన్ని తాము అనుసరిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మొఢేరా గ్రామ ప్రజలు విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించడాన్ని ప్రస్తావించిన మోదీ.. ఇదే విధానాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు.

Published : 25 Nov 2022 01:36 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఓటర్లకు రాజకీయ పార్టీలు ముందస్తు హామీలు గుప్పిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆమ్‌ఆద్మీతోపాటు కాంగ్రెస్‌ పార్టీలు ఉచితంగా విద్యుత్‌ అందిస్తామని ప్రకటించాయి. తాజాగా వీటిపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇది ఉచిత విద్యుత్‌ ఇచ్చే కాలం కాదని, కరెంటు నుంచి ఆదాయం పొందే సమయమని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర గుజరాత్‌లోని ఆరావళి జిల్లాలో పర్యటించిన ఆయన.. ఉచిత కరెంటు హామీపై ఈ విధంగా స్పందించారు.

‘మొఢేరా గ్రామం మొత్తం సౌర విద్యుత్తుతో నడుస్తోంది. వారి అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ వాడుకుంటున్నారు. అదనపు కరెంటును ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. ఇలా ఉచితంగా కరెంటు లభిస్తున్నందున ఫ్రిజ్‌, ఏసీ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను కొనుగోలు చేసేందుకు అక్కడి మహిళలు సిద్ధమవుతున్నారు. ఈ విధానాన్ని గుజరాత్‌ మొత్తం వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నాను. ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికి బదులు.. దాని నుంచి ప్రజలు ఆదాయాన్ని పొందే కళ మోదీకి మాత్రమే తెలుసు’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఉద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్తు వినియోగ గ్రామంగా గుజరాత్‌లోని మొఢేరా గ్రామం రికార్డుల్లోకెక్కిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పంజాబ్‌, దిల్లీలో మాదిరిగా 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ గుజరాత్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇదే దారిలో పయనించిన కాంగ్రెస్‌ కూడా ఉచితంగా విద్యుత్‌ అందిస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో విద్యుత్తును ఉచితంగా పొందడం కంటే కరెంటు ద్వారా ఆదాయాన్ని పొందే మార్గాన్ని భాజపా కల్పిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని