Jagga Reddy: కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు: జగ్గారెడ్డి

ఎవరేం మాట్లాడినా కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరగదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy)  అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు.

Updated : 16 Feb 2023 15:32 IST

హైదరాబాద్‌: భారాస ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని.. కాంగ్రెస్‌(Congress)కు అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మర్యాదపూర్వకంగానే ఠాక్రేను కలిసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కలిశానని.. తమ మధ్య అనేక రాజకీయాంశాలు చర్చకు వచ్చాయని చెప్పారు. భారాస, భాజపాను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించినట్లు చెప్పారు. 

‘‘పార్టీలోని అంతర్గత విషయాలపై మా మధ్య చర్చ జరగలేదు. ఠాక్రే అనుభవం తెలంగాణ కాంగ్రెస్‌కు ఉపయోగపడుంది. రాష్ట్రంలోని 70 స్థానాల్లో విజయం కోసం పనిచేస్తాం. కాంగ్రెస్‌ బలం, బలహీనతను ఠాక్రేకు వివరించా. చాలా మంది సీనియర్లు పాదయాత్ర షెడ్యూల్‌ఇచ్చారు. నా పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను త్వరలో తెలియజేస్తా. ఎంపీ కోమటిరెడ్డి మాటలను వక్రీకరించారు. ఆయన చెప్పింది ఒకటైతే.. మీడియాలో వచ్చింది మరొకటి.. ప్రజలకు అది మరోలా అర్థమైంది. ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్‌కు నష్టం జరగదు. పార్టీకి నష్టం జరిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదు’’ అని జగ్గారెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడు కోమటిరెడ్డి..

అనంతరం ఏఐసీసీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మాణిక్ రావు ఠాక్రేతో పాదయాత్రలపై చర్చించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ మేనిఫెస్టోపైనా చర్చించామన్నారు. కోమటిరెడ్డి కాంగ్రెస్ సిద్దాంతాన్ని నమ్మిన నాయకుడని అన్నారు. ఇప్పటికే ఆయనతో మాణిక్‌ రావు ఠాక్రే మాట్లాడారని చెప్పారు. ఈనెల 28న కోమటిరెడ్డి , మార్చి 1న ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2న భట్టి పాదయాత్రలు చేస్తారని వివరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు ఉత్తమ్, భట్టి , కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతోపాటు తాను కూడా పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తానన్నారు. మార్చి మొదటి వారంలో పాదయాత్ర చేయాలని ఆలోచిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్‌లో అందరం కలిసే ఉన్నామని.. నాయకుల మధ్య అభిప్రాయ బేధాలే తప్ప విభేదాల్లేవని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటానికి బండి సంజయ్ ఎవరని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని దామోదర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని