
Lakhimpur Kheri incident: భాజపా భారీ మూల్యం చెల్లించక తప్పదు: పవార్
దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో హింసాత్మక ఘటనల అనంతర పరిణామాలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత రైతు కుటుంబాలను ఓదార్చడానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీఎంలు, ఎంపీలతో పాటు పలు రాజకీయ పార్టీల ముఖ్య నేతలను నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. లఖింపుర్ ఖేరి ఘటన జలియన్‌వాలాబాగ్ నరమేధాన్ని తలపిస్తోందని ఎన్సీపీ అగ్రనేత, కేంద్రమాజీ మంత్రి శరద్ పవార్ అన్నారు. భాజపాకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని, ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు. కేంద్రంతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించడంలేదన్నారు. యూపీలో జలియన్‌వాలాబాగ్ ఉదంతంలాంటి పరిస్థితులు చూస్తున్నామన్నారు. ప్రతిపక్షాలన్నీ రైతుల వెంటే ఉన్నాయని భరోసా ఇచ్చారు. భవిష్యత్తు ఉమ్మడి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
ఈ దుర్ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు పవార్ డిమాండ్ చేశారు. భాజపా నేతలు సున్నితత్వంతో లేరని, రైతుల మరణం పట్ల సంతాపం తెలిపేందుకు కూడా వారు సిద్ధంగా లేరని ఆరోపించారు. లఖింపుర్ ఖేరిని సందర్శించేందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతలు, ఎంపీలు, సీఎంలను సైతం వెళ్లనీయకుండా అడ్డుకొంటున్నారని, ఇది వారి ప్రాథమిక హక్కులకు భంగంకలిగించడమేనని మండిపడ్డారు.
చట్టం ముందు అంతా సమానమైతే ఇలా ఉంటుందా?
మరోవైపు, కేంద్రం, యూపీ పాలకుల అణచివేత ధోరణులకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీల ఉమ్మడి కార్యాచరణకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీకి ముందు రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రైతులను కారుతో ఢీకొట్టిన కేంద్రమంత్రి తనయుడు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక మాత్రం జైలులో ఉన్నారు. చట్టం ముందు అంతా సమానమైతే ఇలా ఉంటుందా?’’ అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల లఖింపుర్ ఖేరీని సందర్శించే అంశంపై చర్చించినట్టు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.