Pawan Kalyan: న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచాం: పవన్‌ కల్యాణ్‌

జనసేన నాయకులకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం పట్ల ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. అక్రమ కేసుల వల్ల బాధితులైన వారందరికీ ఊరట లభించే వరకు న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Published : 21 Oct 2022 19:11 IST

అమరావతి: విశాఖపట్నంలో అరెస్టయిన జనసేన నాయకులకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం, మరో ముగ్గురిని అరెస్టు చేయొద్దని ఆదేశించడం పట్ల ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈకేసులో జైలులో ఉన్న 9మంది నాయకులకు ఊరట లభించిందన్నారు. ఈనెల 15 నుంచి 17వరకు విశాఖలో  ప్రభుత్వ ప్రాయోజిత అలజడి ఏవిధంగా ఉందో రాష్ట్ర ప్రజలంతా చూశారని, అక్రమ కేసుల విషయంలో తాము న్యాయపోరాటం మెదలుపెట్టామని చెప్పారు.

ఈ సందర్భంగా హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్.. తాము న్యాయ వ్యవస్థపైనే నమ్మకం ఉంచామని తెలిపారు. అక్రమ కేసుల వల్ల తమ పార్టీ నాయకులు కోన తాతారావు, సుందరపు విజయ కుమార్‌, సందీప్‌ పంచకర్ల, కొల్లు రూప, పీవీఎస్‌ఎస్‌ఎన్‌ రాజు, పీతల మూర్తి యాదవ్‌, చిట్టిబిల్లి శ్రీను, రాయపురెడ్డి కృష్ణ, జి.శ్రీనివాస పట్నాయక్‌ జైలు పాలయ్యారని... వీరిని పాలకపక్షం వేధింపులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపైనా న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న పార్టీ నాయకులు టి.శివశంకర్‌, బొలిశెట్టి సత్య, డాక్టర్‌ రఘును అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం చెప్పిందన్నారు. విధివిధానాలకు కట్టుబడి, చట్టాన్ని గౌరవించే తమ పార్టీ నాయకులు, శ్రేణులకు హైకోర్టు తీర్పు ఎంతో ఊరట కలిగించిందన్నారు.  ఈ కేసులో జైలు పాలైన వారి కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనకు లోనయ్యారో తనకు తెలుసునని, వారందరినీ త్వరలో కలుస్తానని చెప్పారు. అక్రమ కేసుల వల్ల బాధితులైన వారందరికీ ఊరట లభించే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని పవన్‌ కల్యాణ్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని