Pawan kalyan: పవన్‌ ఇంటి వద్ద రెక్కీ.. ముగ్గురిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్‌లోని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో కుట్ర కోణం ఏమీ లేదని తేల్చేశారు.

Published : 05 Nov 2022 01:44 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు దాడికి కుట్ర ఏమీ జరగలేదని తెలిపారు. నిందితులు ఆదిత్య విజయ్‌, వినోద్‌, సాయికృష్ణగా గుర్తించినట్టు చెప్పారు. ‘‘ముగ్గురు యువకులు పబ్‌లో మద్యం తాగి వస్తూ పవన్‌ ఇంటి వద్ద కారు ఆపారు. కారు తీయాలని అడిగిన పవన్‌ సెక్యూరిటీతో వారు గొడవపడ్డారు. తాగిన మైకంలోనే గొడవపడినట్టు యువకులు అంగీకరించారు. పవన్‌ ఇంటి వద్ద ఆపిన గుజరాత్‌ రిజిస్ట్రేషన్‌ కారు సాయికృష్ణది’’ అని పోలీసులు వెల్లడించారు.

జూబ్లీహిల్స్‌లో జనసేన కార్యకర్తల ఆందోళన..

మరోవైపు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-36లోని తబ్లా రస పబ్‌ను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్‌ కల్యాణ్ ఇంటికి సమీపంలో ఉన్న పబ్‌ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నివాస ప్రాంతాల మధ్య పబ్‌లు ఉండొద్దని డిమాండ్‌ చేస్తున్నారు. పబ్‌ వద్దకు జనసేన కార్యకర్తలు భారీగా తరలివస్తుండటంతో సమీపంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకుంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని