Pawan Kalyan: తెదేపాతో పొత్తు.. పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

భాజపాతో తమ పార్టీ అనుబంధం చాలా అద్భుతంగా ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Updated : 08 May 2022 16:45 IST

శిరివెళ్ల: భాజపాతో తమ పార్టీ అనుబంధం చాలా అద్భుతంగా ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులు ఉండాలని.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ యత్నాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్రాన్ని రక్షించాలంటే వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని ఆయన పునరుద్ఘాటించారు. భాజపాతో వందశాతం పొత్తు కొనసాగుతోందని చెప్పారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో పవన్‌ మాట్లాడారు. 

ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి..

‘‘పొత్తు ప్రజలకు ఉపయోగపడాలి. నా వ్యక్తిగత ఎదుగుదలను ఎప్పుడూ చూడలేదు. సమస్యలను పరిష్కరించలేనపుడు ప్రజల పక్షాన నిలబడేందుకు బయటకు వస్తాను. అంతే తప్ప వ్యక్తిగతంగా లాభాపేక్ష పెట్టుకోను. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అనే మాట నేను తెచ్చిపెట్టుకున్నది కాదు. ఆ మాట నా నోట రావడానికి వైకాపా ప్రభుత్వ పాలనే కారణం. ఎవర్నీ బతకనివ్వట్లేదు. సమస్యలన్నీ చూసి ఏపీ భవిష్యత్తుకి బలమైన చాలా మంది కలిసి రావాలి. వ్యతిరేక ఓటు చీలి వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత దిగజారిపోతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో తెలుసు. కచ్చితంగా ఏపీ భవిష్యత్తుకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి. దీన్ని జనసేన ముందుకు తీసుకెళ్లాలి’’

ఎవరెవరు కలిసొస్తారో నాకూ తెలీదు..

ఈ విషయంలో ఎవరెవరు కలిసొస్తారో ఈరోజుకి నాకూ తెలీదు. ప్రత్యామ్నాయ ప్రభుత్వం అనేది నా కోరిక. ఎమర్జెన్సీ సమయంలో దేశం అట్టుడుకుతున్నప్పుడు అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్‌కి ఎదురొడ్డి నిలిచాయి. వైకాపా పాలనలో అస్తవ్యస్థంగా ఉన్న పాలనను సరిదిద్దాలంటే ఓటు చీలిపోకూడదు. అదే జరిగితే ప్రజలకు ఇంకోసారి నష్టం వాటిల్లుతుంది. అందరూ కలిసొచ్చి విశాల దృష్టితో పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలకు ఎంత భరోసా కల్పిస్తారనేది భవిష్యత్తులో తేలుతుంది. ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉంది. దీనిపై అందరూ చర్చ జరపాలి. భవిష్యత్తులో ఏపీ నిర్మాణానికి అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నా’’ అని పవన్‌ పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై పవన్‌ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

భాజపాతో మీ రిలేషన్‌ ఎలా ఉంది?

పవన్‌: అద్భుతంగా ఉంది.

జనసేనకు భాజపా నేతలు రోడ్‌ మ్యాప్‌ ఇచ్చారా? లేదా?

పవన్‌: ఏడుకోట్ల మంది ప్రజల సమస్య. చాలా ఆలోచించి కచ్చితంగా తీసుకుంటాం. రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన విషయాలు, వ్యూహాలు వెంటవెంటనే ఎందుకు చెప్తాం. సరైన సమయంలో పరిస్థితులను బట్టి చెప్తాం.

భాజపా అధ్యక్షుడు రోడ్‌ మ్యాప్‌ ఇచ్చినట్లు చెప్పారు కదా?
పవన్‌: అన్నారా.. మీరు చెప్పింది ఒకసారి పరిశీలించి చెప్తాను.

భాజపాతో కలిసి పనిచేస్తున్నామని చెబుతూ ఒంటరిగా పోరాటం చేస్తున్నారు కదా?

పవన్‌: పోరాటం ఒంటరిగా ఎక్కడ చేస్తున్నాం? ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది.. కచ్చితంగా చేస్తాం.

పొత్తులపై తెదేపా మిమ్మల్ని ఆహ్వానిస్తే మాట్లాడతారా? లేదా?

పవన్‌: రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం బలమైన ఆలోచనా విధానంతో ముందుకెళ్తాం.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటున్నారు కదా.. అలా జరగకుండా ఎలా ముందుకెళ్తారు?

పవన్‌: ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని