Published : 04 Jul 2022 01:46 IST

Pawan Kalyan: వైకాపాకు, జనసేనకు ఉన్న తేడా అదే..: పవన్‌

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు వైకాపా హానికరమని జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) అన్నారు. ఏ ఒక్కరి వల్లో రాష్ట్రం బాగుపడుతుందని తాను అనుకోవడంలేదని.. చిత్తశుద్ధితో కూడిన కార్యకర్తలు ప్రతి గ్రామంలో పట్టుమని పది మంది ఉండి.. రాష్ట్రానికి బలమైన నేతల సమూహం ఉంటే తప్ప సమస్యల వలయం నుంచి బయటకు తీసుకురాలేమన్నారు. ఆ బాధ్యతను జనసేన తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని వైకాపా రాక్షస పాలన నుంచి బయటపడేయొచ్చన్నారు. జనవాణి కార్యక్రమం అనంతరం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 

నా నుంచి అద్భుతాలు ఆశించొద్దు

రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని.. యువతకు ఉపాధి, ఉద్యోగాల్లేవని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలకు ఓపిక లేదని.. కానీ పండుగలు, పుట్టినరోజులు.. రకరకాల సంబరాలకు మాత్రం వారికి సమయం ఉంటుందని విమర్శించారు. ప్రెస్‌మీట్లు పెట్టి బూతులు తిట్టడానికీ వారికి టైం దొరుకుతుంది గాని.. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు సమయం ఉండటంలేదని పవన్‌ ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వారు సమయం కేటాయించేలా సమాజం నుంచి ఒత్తిడి రాకపోతే మార్పు రావడం కష్టమని వ్యాఖ్యానించారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్యాయం జరిగిన సగటు మనిషి పక్షాన నిలబడాలన్న ఉద్దేశంతోనే జనవాణి కార్యక్రమం ప్రారంభించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమం సందర్భంగా రైతులకు గిట్టుబాటు, కౌలు రైతుల సమస్యలతో పాటు టిడ్కో ఇళ్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్‌, విదేశీ విద్యా పథకం సహా అనేక అంశాలపై ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న స్పందన కార్యక్రమం విజయవంతమైతే ఈరోజు ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయని పవన్‌ ప్రశ్నించారు.  ప్రజా సమస్యల్ని పరిష్కరించే శక్తి తనకు లేకపోయినా వాటిని ఎక్కువ మంది దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయగలనన్నారు. 

‘‘నా నుంచి అద్భుతాలు ఆశించొద్దు.. నేను సీఎంని కాదు. నేను సగటు మనిషిని. ప్రజల సమస్యల్ని పది మంది దృష్టికి తీసుకెళ్లగలను. మీ సమస్యలను సంబంధిత శాఖలకు చేరవేసి ఒత్తిడి తేగలం. మీ గ్రామాల్లో/ మండలాల్లో ఉన్న చిన్నపాటి సమస్యలైనా మా దృష్టికి వస్తే.. మరికొందరికి తెలిసేందుకు అవకాశం ఉంటుంది. ఉద్దానం సమస్య ఎక్కడో మారుమూలగా ఉండేది.. మేం మాట్లాడాక ప్రపంచ సమస్యగా మారింది. ఓ వ్యక్తిగా నేను చేయగలిగేది ఎక్కువమంది దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేయగలగడమే. నాయకుడికి హృదయం ఉండాలి. మనుషులతో మాట్లాడాలి. సమస్యలకు పరిష్కారం వెంటనే రాదు. పదిమందితో మాట్లాడే కొద్దీ పరిష్కారం వస్తుంది‘‘ అని పవన్‌ అన్నారు.

వైకాపాకు, మాకూ ఉన్న తేడా అదే..! 

‘‘వెనుజులా, శ్రీలంక లాంటి దేశాల్లో వనరులు ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడంతో విఫలమయ్యాయి. ఏపీకి వనరులు తక్కువ. దోచేయడానికి మాత్రం రూ.లక్షల కోట్లు దొరుకుతున్నాయి. సమర్థ నాయకత్వం లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి? జనాన్ని ఎలా మభ్యపెట్టాలి? ప్రత్యర్థి పార్టీలను ఎలా ఇబ్బంది పెట్టాలి? ఎలా కేసులు పెట్టాలనే దానిపై వారికి సమర్థత ఉంది. కానీ, ప్రజల సమస్య పరిష్కారించడం మాత్రం ఇష్టం ఉండదు. వైకాపాకు జనసేనకు ఒకటే తేడా. ఫలానా పనిచేస్తే మాకు ఇన్ని ఓట్లు వస్తాయని వారు లెక్కలు వేసుకుంటారు. ఈ పనిచేస్తే వాళ్ల జీవితం ఎంతో బాగుపడుతుందని మేం అనుకుంటాం. అంతే తేడా. ప్రజలు మనకు ఓట్లు వేస్తారా? లేదా? అనుకొనే కంటే మనం వారితో ఉన్నామనే భరోసా ఇవ్వగలిగితేనే ఓట్లు అడిగే హక్కు మనకు ఉంటుంది. ఎన్నికల నాటికి ఎంత మంది నిలబడతారో తెలియదు గానీ.. ప్రజల కోసం జనసేన నిలబడుతుంది. బాధ్యతతో పనిచేస్తాం. తప్పు చేసినోడి తోలు తీసేలా శాంతిభద్రతలను అమలుచేస్తాం’’ అని పవన్‌ అన్నారు.

మోదీకి స్వాగతం..

‘‘ఆజాదీ అమృత్‌ మహోత్సవాల సందర్భంగా భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వస్తున్న ప్రధాని మోదీకి జనసేన, జనసైనికుల పట్ల స్వాగతం పలుకుతున్నాం. మనందరి గుండెల్లో స్ఫూర్తిని నింపిన అల్లూరి విగ్రహావిష్కరణకు రావడం సంతోషదాయకం. భీమవరం నుంచి పోటీ చేసిన వ్యక్తిగా ప్రత్యేకించి నాకిది ఆనందదాయకం. ఆజాదీ అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమానికి నాకు కూడా ప్రత్యేకించి ఆహ్వానం పంపినందుకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి కృతజ్ఞతలు. 4వ తేదీన జరిగే సభలో జనసేన కూడా ప్రాతినిధ్యం వహించాలని మా నేతలందరినీ కోరాను. సంపూర్ణ మద్దతు ఇవ్వాలని శ్రేణులకు విజ్ఞప్తి చేశాను’’ అని పేర్కొంటూ పవన్‌ కల్యాణ్‌ ఓ వీడియోని విడుదల చేశారు. 


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని