Murthy Yadav: శారదా పీఠంపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలి

శారదా పీఠం ముసుగులో రూ.వేల కోట్లు అక్రమంగా సంపాదించిన స్వరూపానంద, స్వాత్మానందలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపి లెక్క చెప్పని ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 21 Jun 2024 04:31 IST

ఆంధ్ర, తెలంగాణల్లో ప్రభుత్వాలు ఇచ్చిన భూములు స్వాధీనం చేసుకోవాలి
జనసేన నాయకుడు పీతల మూర్తియాదవ్‌ డిమాండ్‌

విశాఖపట్నం (సీతంపేట), న్యూస్‌టుడే: శారదా పీఠం ముసుగులో రూ.వేల కోట్లు అక్రమంగా సంపాదించిన స్వరూపానంద, స్వాత్మానందలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపి లెక్క చెప్పని ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ డిమాండ్‌ చేశారు. విశాఖలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణలో గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ను పూజలు, యాగాల పేరిట మభ్యపెట్టి కోకాపేటలో ఆలయం, ఆధ్యాత్మికం పేరిట రూ.250 కోట్ల విలువైన భూమిని ఉచితంగా పొందిన స్వరూపానంద నెలకు రూ.కోటి అద్దె వచ్చేలా వాణిజ్య సముదాయం నిర్మించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం నుంచి విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో అత్యంత విలువైన ఐదెకరాల భూమిని వేద విద్య, ధర్మప్రచారం పేరిట పొంది.. దాన్ని భవిష్యత్తులో నెలకొల్పబోయే పీఠాల కోసం వాణిజ్యపరంగా వినియోగించుకొంటామంటూ లేఖ రాయడం వారి వ్యాపార కాంక్షకు నిదర్శనమని ఆరోపించారు. భిక్షమెత్తుకొంటూ ఆధ్యాత్మిక సేవ చేసే స్వరూపానంద, స్వాత్మానందల వద్ద రూ.వందల కోట్లకు పైగా డబ్బు, కిలోలకొద్దీ బంగారం ఎలా వచ్చాయని మూర్తియాదవ్‌ ప్రశ్నించారు. 2018లో పీఠం పేరిట కోటి రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వుంటే అది ఇప్పుడు రూ.44 కోట్లకు చేరటం వాస్తవం కాదా అని నిలదీశారు. బినామీ పేర్లతోనూ రూ.60 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని