Andhra News: సమస్యల సృష్టికర్త జగన్‌: నాదెండ్ల మనోహర్‌

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కౌలు రైతుల ఆత్మహత్యలకు ఎటువంటి నష్టపరిహారాన్ని అందించలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

Published : 22 Apr 2022 01:26 IST

తెనాలి: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కౌలు రైతుల ఆత్మహత్యలకు ఎటువంటి నష్టపరిహారాన్ని అందించలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. వైకాపా హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మనోహర్‌ మాట్లాడారు. రైతులకు ఏమాత్రం భరోసా ఇవ్వలేని ప్రభుత్వం ఇది అని ఆక్షేపించారు. పంట నష్ట పరిహారం, సబ్సిడీ ద్వారా విత్తనాల కొనుగోలు విషయాల్లో ప్రభుత్వం కులం, పార్టీ చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌలు రైతులను ఆదుకునే విధంగా తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ కౌలు రైతుల భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి తమవంతు ఆర్థిక సహాయంగా రూ.లక్ష అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి రూ.7లక్షల నష్టపరిహారం అందిస్తామని వైకాపా హామీ ఇచ్చిందని.. కానీ ఆచరణలో ఏ ఒక్క కుటుంబానికీ న్యాయం జరగలేదని మనోహర్ ఆరోపించారు. సమస్యల సృష్టికర్త జగన్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. కౌలు రైతు ఆత్మహత్య వివరాలు ప్రభుత్వం బయటకి రానివ్వడం లేదన్నారు. పవన్ కల్యాణ్‌ పర్యటన అనేసరికి ప్రభుత్వం హడావుడిగా రైతుల ఖాతాల్లో రూ.రెండు లక్షలు వేసి పవన్ సభకు వెళ్లొద్దని ఆయా కుటుంబ సభ్యులను అధికారులు మభ్యపెట్టడం బాధాకరమన్నారు. కచ్చితంగా రూ.7లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కరెంట్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని.. మిగులు విద్యుత్ గల రాష్ట్రాన్ని ఇలా తయారు చేశారని మండిపడ్డారు. ప్రజలను ఆదుకోలేని ముఖ్యమంత్రి ఎందుకని విమర్శించారు. ఎప్పుడూ సొంత సంపాదనే తప్ప ప్రజల సంక్షేమంపై ఆయన దృష్టి పెట్టలేదని మనోహర్‌ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని