Janasena: మంత్రి అంబటిని నిలదీసిన గంగమ్మకు జనసేన సాయం.. రూ.4లక్షల చెక్కు అందజేత

తనకు జరిగిన అన్యాయాన్ని గురించి మంత్రి అంబటి రాంబాబును నిలదీసిన మహిళకు జనసేన నేతలు అండగా నిలిచారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ బాధితురాలికి రూ.4 లక్షల చెక్కు అందించారు.

Updated : 17 Feb 2023 18:10 IST

గుంటూరు: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబును నిలదీసిన బాధితురాలికి జనసేన పార్టీ తరఫున రూ.4లక్షల చెక్కును అందించి సాయం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ చేతుల మీదుగా బాధితురాలు తురకా గంగమ్మకు చెక్కు అందజేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని నిలదీసినందుకు గంగమ్మకు మంత్రి రాంబాబు తీవ్ర అన్యాయం చేశారని మనోహర్‌ మండిపడ్డారు. ఆయన బాగోతాన్ని బయటపెట్టినందుకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.5లక్షల చెక్కును సైతం వెనక్కి పంపించారని, ఆమెకు ఆ డబ్బులు తిరిగి వచ్చేంత వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు. గంగమ్మకు పరిహారం అందించడంలో అలసత్వం చూపించిన అధికారులను వదలబోమని మనోహర్‌ హెచ్చరించారు. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనకు రావాల్సిన ఇంటిని కూడా ఆపేశారని గంగమ్మ ఆవేదన వ్యక్తం చేసినట్లు జనసేన నేతలు వెల్లడించారు.

నేపథ్యమిదీ..

గుంటూరు సమీపంలోని దాసరిపాలెం నుంచి తురక పర్లయ్య కుటుంబం బతుకుదెరువు కోసం ఏడాదిన్నర కిందట సత్తెనపల్లి వచ్చి రోడ్డు పక్కనే పూరిల్లు వేసుకుని జీవిస్తోంది. పర్లయ్య, గంగమ్మలకు అనిల్‌ (17), సమ్మక్క (14) సంతానం. పర్లయ్య అనారోగ్యంతో ఇంటి పట్టునే ఉంటుండగా గంగమ్మ ప్రైవేటు పాఠశాలలో పారిశుద్ధ్య పనికి వెళ్తున్నారు. కుటుంబానికి ఆధారమైన అనిల్‌ ఆగస్టు 20న రాత్రి పట్టణంలోని వినాయక హోటల్‌లో డ్రైనేజీ గుంతలో మురుగు తీస్తూ చనిపోయాడు. దీంతో 20 రోజుల క్రితం వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల చెక్కు వచ్చినట్లు తెలుస్తోంది. రూ.2.50 లక్షలిస్తేనే చెక్కు ఇస్తామని ఛైర్‌ పర్సన్‌ భర్త, మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారని బాధితులు వాపోయారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన స్థానిక జనసేన నాయకులు మంత్రి అంబటిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఈ ఆరోపణలను మంత్రి ఖండించారు. ‘‘పరిహారం సొమ్ములో లంచం తీసుకునే దౌర్భాగ్యం నాకు లేదు. నిజంగా నేను కక్కుర్తి పడివుంటే రాజీనామా చేస్తా. మృతుడి కుటుంబానికి పరిహారం ఇప్పించిందే నేను. శవాలపై నేను పేలాలు ఏరుకోవడమేంటి? రూ.2లక్షలు డబ్బులు తీసుకునే నీచమైన మనస్తత్వం నాది కాదు. నన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించే దుర్మార్గమైన ఆలోచన ఇది’’ అని వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని