Pawan kalyan: కష్టాల్లో ఉన్నవారంతా నా సొంతవాళ్లే.. నేనెవరికీ దత్తతగా వెళ్లను: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులను ఆదుకునేవారు లేకుండా పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 23 Apr 2022 19:34 IST

చింతలపూడి: ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులను ఆదుకునేవారు లేకుండా పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని.. వారికి అండగా ఉండాలని పవన్‌ డిమాండ్ చేశారు. కౌలు రైతులు అధిక వడ్డీకి అప్పు తీసుకుంటున్నారని.. ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని.. ఇప్పటివరకు 3 వేలకుపైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు.

నేను ఒక్కొక్క మెట్టు ఎక్కాలనుకునేవాడిని...

‘‘కౌలు రైతుల సమస్యలను వైకాపా ప్రభుత్వం సృష్టించిందని నేను చెప్పడం లేదు. కౌలు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం వల్లే ఈ సమస్యను నేను బయటకు తీసుకొచ్చాను. నిజంగా వైకాపా ఇవాళ కౌలు రైతులకు అండగా ఉంటే నేను రోడ్డు మీదకు రావాల్సిన అవసరం వచ్చేది కాదు. ఈ సభకు పెద్ద ఎత్తున యువత హాజరయ్యారు. మీలో చాలా మంది వైకాపాకు ఓటేశారు. నాపై వ్యక్తిగత ఇష్టం ఉన్నప్పటికీ రాజకీయంగా జగన్‌కు ఓటేశారు. నేను స్వాగతిస్తాను. నేను ఒక్కొక్క మెట్టు ఎక్కాలనుకునేవాడిని. రాత్రికి రాత్రి ఎక్కడికో వెళ్లాలనుకోను. ఇంత బలమైన మెజారిటీ ఇచ్చిన ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. రైతు ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానం.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ కొంత మంది వైకాపా కార్యకర్తలు ఉండే ఉంటారు. వైకాపా అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదు. ప్రజల కన్నీళ్లు తుడవకపోతే గ్రామాల్లో ఎందుకండి గ్రామ సచివాలయాలు? జనసేన ఎత్తుకుంటే తప్ప మీకు సమస్య గుర్తుకురాలేదా? ప్రజల కన్నీళ్లు తుడుస్తామని చెప్పిన జగన్‌ అలా చేయకపోతే మాత్రం గట్టిగా అడుగుతాం’’

ఇంకోసారి దత్తపుత్రుడు అంటే..

రైతుల సమస్యలను ఎత్తుకుంటే మీ నాయకుడు మమ్మల్ని దత్తపుత్రుడు అని అంటాడు. ఎవరెన్నిసార్లు అలా అన్నా మర్యాదగా మాట్లాడాను. ఇంకొకసారి నన్ను దత్తపుత్రుడు అని అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇలాగే కొనసాగితే సీబీఐ దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుంది. నేను ప్రజల కష్టాలు, ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతున్నా. వ్యక్తిగతంగా ఎవరినీ దూషించను. కానీ నన్ను మాత్రం చాలా నీచంగా దూషిస్తున్నారు. కౌలు రైతుల సమస్యలు నేను సృష్టించినవి కాదు. ఒకసారి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబసభ్యులతో మాట్లాడండి. అసలు సమస్య ఏంటో తెలుస్తది. అధికారం మీ చేతుల్లో ఉంది. మీరే పట్టించుకోకపోతే ఎలా?ఇప్పటికీ ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇంకోసారి దత్తపుత్రుడు అంటే సీబీఐకి దత్తపుత్రుడు అనే మాటను ఫిక్స్‌ అవుతాం. కష్టాల్లో ఉన్నవారంతా నా సొంతవాళ్లే.. నేనేవరికి దత్తతగా వెళ్లను. అనంతపురం సభ తర్వాత నర్సాపురం ఎంపీ నాకు కొన్ని సూచనలు చేశారు. మీరు సరిగ్గా కొన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని అన్నారు. సరిదిద్దుకోవాలని చెప్పారు. వారి సూచన మేరకు నేను సరిదిద్దకుంటాను. పోయినసారి చర్లపల్లి షటిల్‌ టీం అని అన్నాను. అది చర్లపల్లి కాదు.. చంచల్‌గూడ షటిల్‌ టీం అని చెప్పారు. చంచల్‌గూడలో షటిల్‌ ఆడుతూ మీరు నాకు చెబుతున్నారా? కష్టాల్లో ఉన్నవారంతా నా సొంతవాళ్లే.. నేనేవరికి దత్తతగా వెళ్లను. నన్ను దత్తత తీసుకుంటే ఎవరూ భరించలేరు’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

జనసైనికులపై చేయి పడితే..

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఏం చేస్తోంది? ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు ఉపయోగించుకోవచ్చు కదా. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మోసపోయేవాడిని కాదు నేను. నేను ఏం చేయగలనో అదే చేస్తున్నాను. అందుకే ప్రత్యేక నిధి పెట్టుకున్నాను. జనసైనికుల మీద పోలీసులు, వైకాపా గూండాలతో దాడి చేయించారు. వైకాపా నాయకులకు చెప్తున్నాను. నేను ఎంత మేర సహనం పాటిస్తానో నాకు తెలుసు. ఇక అవడం లేదనుకుంటే మాత్రం ఎలా అర్థమయ్యేలా చేప్పాలో కూడా నాకు బాగా తెలుసు. జనసైనికులపై చేయి పడితే మాత్రం సహించేది లేదు. గీతా సారాంశాన్ని నమ్మే వ్యక్తిని నేను. కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తాను. ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఇస్తే చేసుకుంటూ పోతాను.. లేకున్నా ప్రజలకు దాసుడిగానే ఉంటాను. అధికారం వస్తే ఏం చేస్తానో చెప్పడం లేదు.. నాకున్నదాంట్లో ఎంత చేయగలనో చేస్తున్నాను. వైకాపా పాలన ఘోరంగా సాగుతోంది. దీన్ని మార్చే శక్తి కేవలం యువతకు మాత్రమే ఉంది. మీరు బాధ్యత తీసుకోకపోతే ఈ సమాజంలో మార్పు రాదు. కళ్లముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా నిలబడ్డా. ఓటమే గెలుపునకు పునాదని నమ్ముతా.. అందుకే నిలబడి ప్రజల కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నాను.’’ అని పవన్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని