యూపీ ఎన్నికలపై జేడీయూ కీలక నిర్ణయం!

ఉత్తరప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌కు చెందిన జేడీయూ పార్టీ భాజపాకు వ్యతిరేకంగా పోటీ చేయనుంది. బిహార్‌లో ఆ పార్టీ భాజపాతో పొత్తులో భాగంగా ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించినప్పటికీ..

Updated : 28 Jan 2021 04:28 IST

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌కు చెందిన జేడీయూ పార్టీ భాజపాకు వ్యతిరేకంగా పోటీ చేయనుంది. బిహార్‌లో ఆ పార్టీ భాజపాతో పొత్తులో భాగంగా ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించినప్పటికీ.. యూపీ ఎన్నికల్లో మాత్రం వేరుగా పోటీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఆ నిర్ణయంతో బిహార్‌లో ఎలాంటి ప్రభావం ఉండదని.. అంతా సవ్యంగానే ఉంటుందని జేడీయూ వెల్లడించింది. 

జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ.. ‘యూపీలో 2022లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఒంటరిగానే పోటీ చేస్తుంది. భాజపాతో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలో దిగనుంది. జేడీయూ జాతీయ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు. ‘యూపీలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మేం పోటీ చేయలేదు. దాని వల్ల పార్టీకి స్వల్ప నష్టం కలిగింది. కానీ ఈ సారి ఒంటరిగానైనా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. అయితే ఇక్కడ తీసుకునే నిర్ణయం వల్ల బిహార్‌ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉండదు’ అని త్యాగి తెలిపారు. 

కాగా గత నెలలో అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు భాజపాలో చేరడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిహార్‌లోనూ భాజపా, జేడీయూల రాజకీయ భవిష్యత్తుపై అనుమానమేనంటూ ఆర్జేడీ వర్గాలు విమర్శించాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, జేడీయూ కలిసి పోటీ చేశాయి. ఫలితాల అనంతరం ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. రెండో స్థానంలో ఉన్న భాజపా.. జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందంలో భాగంగా నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 

ఇదీ చదవండి

సినిమా థియేటర్లలో 50శాతం నిబంధన సడలింపు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని