Bihar: భాజపాతో నీతీశ్‌ బ్రేకప్‌ వార్తలు: బిహార్‌లో నేతలు బిజీబిజీ..!

బిహార్‌లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. భాజపాకు జేడీయూ బ్రేకప్‌ చెప్తుందన్న వార్తల నేపథ్యంలో.. అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

Updated : 09 Aug 2022 11:25 IST

ఫోన్లకు నో ఎంట్రీ

పట్నా: బిహార్‌లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. భాజపాకు జేడీయూ బ్రేకప్‌ చెప్తుందన్న వార్తల నేపథ్యంలో.. అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అన్నిపార్టీల నేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. అటు జేడీయూ నేతలు ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్ అధికారిక నివాసానికి రాగా, ఇటు ఆర్జేడీ నేతలు, ఇతర విపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి లాలూ సతీమణి రబ్రీదేవీ ఇంటికి వచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

‘గతంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో మా పార్టీ ఇలాంటి సమావేశాలు నిర్వహించింది. పార్టీ సంస్థాగత మార్పుల నిమిత్తం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. ఎన్డీఏలో సంక్షోభం గురించి నేను ఎప్పడూ వినలేదు’ అని జేడీయూ నేత రామ్‌నాథ్‌ ఠాకూర్ వెల్లడించారు. తనకైతే ఈ సంక్షోభం గురించి తెలీదని, కానీ నీతీశ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి సన్నిహిత నేత ఒకరు వెల్లడించారు. ఎమ్మెల్యే వినయ్ చౌధరీ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ‘నీతీశ్ కుమార్‌ను భాజపా వేధించింది. జేడీయూను బలహీనం చేసే కుట్ర జరిగింది. అది పార్టీకి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మేం నీతీశ్‌ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వస్తే.. మాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ నీతీశే సీఎంగా కొనసాగుతారు’ అని పేర్కొన్నారు. 

ఇటుపక్క ఆర్జేడీ నేతలు రబ్రీదేవీకి చెందిన సర్క్యులర్ రోడ్‌ బంగ్లాలో సమావేశమయ్యారు. లాలూ తనయుడు తేజస్వీ యాదవ్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతేగాకుండా కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు, మహాగట్‌బంధన్‌కు చెందిన ప్రతిపక్ష నేతలు వీరితో కలిసొచ్చారు. కాగా, ఈ సమావేశాలకు ఎవరూ ఫోన్ తీసుకురావొద్దని ముందుగానే ఆదేశాలు అందడం గమనార్హం. ‘రెండేళ్లుగా ఈ పుకార్లు వినిపిస్తున్నాయి. నేతలు ఎవరూ ఆవేశపూరిత అంచనాలు పెట్టుకోవద్దు. ఒకసారి పార్టీ అధిష్ఠానం ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. అది అందరికీ తెలిసిపోతుంది’ అని ఆర్జేడీ నేత ఒకరు వెల్లడించారు. మరోపక్క ఇదే విషయమై బిహార్‌కు చెందిన భాజపా నేతలకు దిల్లీ నుంచి పిలుపువచ్చింది. 

గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి జట్టు కట్టి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీతీశ్‌ కుమార్‌ కొంత కాలానికి బయటకు వచ్చి భాజపాతో చేతులుకలిపారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా, జేడీ(యు) కలిసి పోటీ చేశాయి. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ 75 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం సాధించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో జేడీయూ తక్కువ స్థానాలే వచ్చినప్పటికీ మిత్ర ధర్మాన్ని పాటిస్తూ భాజపా నీతీశ్‌కే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. అయితే, కొంతకాలంగా భాజపా, జేడీయూ మధ్య దూరం పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి. వాటికి ఆజ్యం పోసేలా.. ఇటీవల ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అధ్యక్షత వహించిన పలు సమావేశాలకు నీతీశ్ గైర్హాజరయ్యారు. ఇంకోపక్క మాజీ కేంద్రమంత్రి ఆర్‌సీపీ సింగ్(మాజీ జేడీయూ నేత)తో కలిసి జేడీయూను చీల్చేందుకు భాజపా కుట్రచేస్తోందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు