Jeevan Reddy: జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపం.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా యోచన!

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో చిచ్చురేపింది. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.

Updated : 24 Jun 2024 14:33 IST

జగిత్యాల: ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో చిచ్చురేపింది. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఈ విషయంపై తన అనుచరులు, పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారు. భారాసకు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. తనకు సమాచారం లేకుండా ఆయన్ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.

జగిత్యాల నియోజకవర్గంలో 2014 నుంచి మూడు పర్యాయాలు సంజయ్‌, జీవన్‌రెడ్డి ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 2023 ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయన్ను బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నేతలు జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారు కోరినట్లు సమాచారం. 40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని.. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితుల వద్ద జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని