Jharkhand: విశ్వాస పరీక్ష నెగ్గిన హేమంత్‌ సోరెన్‌..

ఝార్ఘండ్‌లో రాజకీయంగా ఉత్కంఠ పరిణామాలు నడుస్తోన్న తరుణంలో..  ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్ష నెగ్గారు.

Published : 06 Sep 2022 01:33 IST

రాంచీ: ఝార్ఘండ్‌లో రాజకీయంగా ఉత్కంఠ పరిణామాలు నడుస్తోన్న తరుణంలో..  ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్ష నెగ్గారు.  81 మంది సభ్యులున్న ఝార్ఖండ్‌ అసెంబ్లీలో సోరెన్‌ సర్కారుకు 48మంది మద్దతు ఇచ్చారు. తనకు తాను ఓ గని లీజును కేటాయించుకున్న నేపథ్యంలో సోరెన్‌పై ‘లాభదాయక పదవి’ నిబంధనల కింద వేటు వేయాలని, ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడిగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. 

 సోరెన్‌ శాసనసభ సభ్యత్వంపై వేటు వార్తల నేపథ్యంలో గత పది రోజులుగా ఝార్ఖండ్ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపించినప్పటికీ రాష్ట్ర గవర్నర్‌ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారపక్షం పేర్కొంది. ఆలస్యం చేస్తుందంటే అక్కడ ఏదో ప్లాన్‌ వేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌కు అధికార కూటమి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. దానిపై స్పందిస్తూ.. త్వరలో నిర్ణయం వెలువడుతుందని గవర్నర్ రమేష్‌ బైస్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా.. విశ్వాస పరీక్ష నిమిత్తం ఈ రోజు ఝార్ఖండ్ అసెంబ్లీ ఒక్కరోజు ప్రత్యేకంగా సమావేశమైంది. భాజపా నిరసన వ్యక్తం చేసి.. విశ్వాస పరీక్ష ఓటింగ్‌కు ముందు సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ ఓటింగ్ సందర్భంగా సోరెన్ మాట్లాడారు. ‘ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా అల్లర్లకు ఆజ్యం పోస్తోంది. అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు కల్పిస్తోంది. ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిమగ్నమయ్యారు. భాజపా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోంది. ఈ సందర్భంగా నేను విన్న మాట చెప్పదల్చుకున్నాను. ప్రజలు దుస్తులు, రేషన్, నిత్యావసరాలు కొనుగోలు చేస్తుంటే.. భాజపా మాత్రం శాసన సభ్యుల్ని కొనుగోలు చేయడంలో మునిగిపోయింది’ అంటూ తీవ్రంగా విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు