CPI-CPM: తెలంగాణ గడ్డపై భాజపాను అడుగు పెట్టనివ్వం: సీపీఐ, సీపీఎం

ప్రజా సమస్యలపై విడివిడిగా పోరాటం చేస్తున్న సీపీఐ, సీపీఎం తెలంగాణ వేదికగా ఏకమవుతున్నట్టు ప్రకటించాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించిన సంయుక్త సమ్మేళనంలో ఇరు పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Published : 09 Apr 2023 20:02 IST

హైదరాబాద్‌: భాజపా నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి ఉమ్మడి పోరాటాలు చేస్తామని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించిన సంయుక్త సమ్మేళనంలో ఇరు పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో భారాసతో కలిసి సాగుతామని, తెలంగాణ గడ్డపై భాజపాను అడుగు పెట్టనివ్వమని కమ్యూనిస్టులు నినదించారు. ప్రజా సమస్యలపై విడివిడిగా పోరాటం చేస్తున్న సీపీఐ, సీపీఎం తెలంగాణ వేదికగా ఏకమవుతున్నట్టు ప్రకటించాయి. సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి సహా ఇరుపార్టీల రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. మొట్టమొదటి సారిగా సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సంయుక్తంగా సమావేశం నిర్వహించడం విశేషం. 

రెండు పార్టీలు కలిసి పనిచేయడానికి ముందుకు రావడం పట్ల సీతారాం ఏచూరి హర్షం వ్యక్తం చేశారు. మోదీ సర్కారు భాజపాయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఏచూరి ఆరోపించారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని లౌకిక వాదాన్ని కాపాడుకోవాలంటే మోదీ సర్కారును గద్దె దించాలన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ.. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే పార్టీగా మారాలని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్ర అధికారాలు వేర్వేరుగా ఉంటాయన్న డి.రాజా.. ఆ హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సహా తమిళనాడు, కేరళలో గవర్నర్‌ను ఒక సాధనంగా కేంద్రం వాడుకుంటోందని ఆరోపించారు. గతేడాది విజయవాడలో ఉద్యమ పునరేకీకరణ జరగాలని ప్రతిపాదించగా ఇప్పటికి అది సాధ్యమవుతోందని హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దేశం కోసం, కార్మికుల రక్షణ కోసం ఒక్కటై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని