Telangana news: ఈ ఛాన్స్‌ మళ్లీ రాదు.. కష్టపడి పనిచేయండి: నడ్డా

తెలంగాణలో భాజపాకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గురువారం తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ఆయన .....

Updated : 05 May 2022 19:14 IST

మహబూబ్‌నగర్‌: తెలంగాణలో భాజపాకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గురువారం తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ఆయన పార్టీ పదాధికారులతో సమావేశమై భాజపా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బూత్ స్థాయిలో పార్టీ విస్తరణకు పని చేయండి. దళిత బస్తీల్లోకి వెళ్లండి.. వారి సమస్యలు తెలుసుకోండి. వారితో కలిసి భోజనం చేయండి. యువ మోర్చా.. యువజన సంఘాలతో, క్రీడాకారులతో సన్నిహితంగా ఉండండి. వారిని రెగ్యులర్‌గా కలవాలి. మహిళా మోర్చా.. స్వయం సహాయక బృందాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను అని కాకుండా.. పార్టీ నాకు పనిచేసే అవకాశం ఇచ్చిందని ఫీల్‌ కావాలి’’ అని సూచించారు.

‘‘ముందస్తు ప్రణాళిక లేకుండా జిల్లా పర్యటన చేయకండి. ఏం మాట్లాడాలో ముందు సన్నద్ధం అవ్వండి. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై మాట్లాడాలంటే ముందస్తుగా ప్రిపేర్‌ కావాలి కదా. నెల రోజుల ముందే నిర్ణయించుకోండి. తెలంగాణలో భాజపాకు మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్త వారు పార్టీలో చేరుతున్నారు. చేరేందుకు సుముఖంగా ఉన్నారు. వచ్చేవారిని ఆహ్వానించండి.. అడ్డుకోవద్దు. పార్టీలో ప్రాధాన్యతపై ఇంకొకరితో పోల్చుకోవద్దు. ఈ అవకాశం మరోసారి రాదు. అధ్యక్షుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. కష్టపడి పనిచేయండి. క్షేత్రస్థాయిలోకి వెళ్లండి. కలిసి ముందుకు సాగండి. ఫలితాన్ని సాధించండి. మీ కన్నా బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చేలా పనిచేయండి. భాజపాకు దేశంలో ఏ పార్టీ సాటికాదు. దేశంలోని కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలూ కుటుంబ పార్టీలే’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని