Viveka murder Case: సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. లేఖలో పలు అంశాలను లేవనెత్తారు.

Published : 28 Jan 2023 12:10 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ద్వారా తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ అవినాష్‌ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. ‘‘వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలి. విచారణను రికార్డు చేసేందుకు అనుమతించాలి. నాతో న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. అయితే అవినాష్‌ లేఖకు సీబీఐ ఇంకా సమాధానం ఇవ్వలేదు.

కాగా, వివేకా హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది.. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావడానికి పులివెందుల నుంచి శుక్రవారం బయలుదేరి వెళ్లారు. సీఆర్పీసీ 160 సెక్షన్‌ కింద అవినాష్‌కు సీబీఐ నోటీసు జారీ చేసింది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగినప్పటి నుంచి.. ప్రతిపక్షాల వేళ్లన్నీ ఎంపీతో పాటు ఆయన తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయి. 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించి.. వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఆ వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలతో ఇప్పుడు కీలకమైన అవినాష్‌రెడ్డి విచారణకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా కేసు హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ అయినందున విచారణ ముమ్మరం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తోంది. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ పేరుతో ఈ నెల 24న ఎంపీకి నోటీసులు జారీ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని