Kakani Govardhan Reddy: అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్: కోటంరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్

వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్‌ ట్యాపింగ్ ఆరోపణలపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఆయనది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదని.. మ్యాన్‌ ట్యాపింగ్‌ అన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడి జగన్‌పై కోటంరెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

Updated : 03 Feb 2023 14:19 IST

నెల్లూరు: తన ఫోన్‌ ట్యాప్‌ చేశారంటూ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy).. ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని, న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయించలేదని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhanreddy) ప్రశ్నించారు. అది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదు.. మ్యాన్‌ ట్యాపింగ్‌ అని ఆక్షేపించారు. శ్రీధర్‌రెడ్డిని తెదేపా అధినేత చంద్రబాబు ట్యాప్‌ చేశారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో కోటంరెడ్డి చేసిన విమర్శల నేపథ్యంలో నెల్లూరులోని వైకాపా (YSRCP) జిల్లా కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

‘‘శ్రీధర్‌రెడ్డి అంతరాత్మకు తెలుసు. అది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదు.. ఆడియో రికార్డే. కోటంరెడ్డి మాటలకు తెదేపా నేతలు వంతపాడుతున్నారు. అవమానం జరిగిందని భావిస్తే దానిపై మాట్లాడకుండా 2024 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా ఉంటున్నట్లు ఆడియోక్లిప్‌లో ఎందుకు పేర్కొన్నారు. మనకు గౌరవం, గుర్తింపు వైఎస్‌ఆర్‌ కుటుంబంతోనే ప్రారంభమైంది. 2019 ఎన్నికల్లో జగన్‌ను చూసి ప్రజలు ఓటేశారు. ఎమ్మెల్యే పదవి ఆయన పెట్టిన భిక్ష కాదా? కోటంరెడ్డి ఉన్న స్థితికి కారణం జగన్‌ కాదా? ఆయన ఆలోచించుకోవాలి. జగన్‌కు వీరవిధేయుడిననని చెప్పుకొని ఇప్పుడు వేరే వాళ్లకు విధేయుడయ్యారు. 

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో చిన్నచిన్న పొరపాట్లు జరిగినా జగన్‌ ఆయన్ను విశ్వసించారు. అందుకే అక్కడ వేరే వాళ్లకు అవకాశం ఇవ్వలేదు. నిజంగా శ్రీధర్‌రెడ్డిపై అనుమానముంటే నియోజకవర్గంలో సంపూర్ణంగా బాధ్యతలు అప్పగించేవారా? నిన్నటి వరకు ఆయన ఏది చెబితే అక్కడ అది జరిగేది.. అనుమానం ఉంటే అలా జరుగుతుందా? పార్టీ జీవనదిలాంటిది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు వైకాపా నుంచి వెళ్లిపోయినా ఏమాత్రం తొణకకుండా పోరాడిన నేత జగన్‌. అలాంటి వ్యక్తికి ఒకరో ఇద్దరో పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన నష్టం లేదు. కోటంరెడ్డి నిర్ణయం ఆత్మహత్యా సదృశం. చంద్రబాబు ఉచ్చులో పడి జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంతో ఏమాత్రం సంబంధం లేని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు సరికాదు. ఇప్పుడు నూటికి 90 శాతం మంది కోటంరెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు’’అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని