Kalvakuntla Kavitha: భారాసతో భాజపా బ్రెయిన్‌ డ్యామేజ్‌: ఎమ్మెల్సీ కవిత

దేశంలో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)(BRS)తో కొత్త చరిత్ర సృష్టిస్తామని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు.

Updated : 13 Dec 2022 15:03 IST

హైదరాబాద్‌: దేశంలో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)(BRS)తో కొత్త చరిత్ర సృష్టిస్తామని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. మీడియాతో ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడారు. మహిళలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) అవహేళన చేస్తున్నారని కవిత ఆరోపించారు. సరైన సమయంలో భాజపాకు బుద్ధి చెబుతామన్నారు. బతుకమ్మను కూడా బండి సంజయ్‌ అవమానించారన్నారు. 

యాగాలు చేయడం కేసీఆర్‌కు కొత్త కాదు..

‘‘భారత్‌ రాష్ట్ర సమితి ప్రకటనతో భాజపా బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయింది. ప్రధాని మోదీ.. మమతా బెనర్జీని, బండి సంజయ్‌ నన్ను అవహేళన చేశారు. పశ్చిమ్‌బెంగాల్‌ ఎన్నికల్లో భాజపాకు ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణలోనూ ఆ పార్టీకి బుద్ధి చెప్తారు. యాగాలు చేయడం సీఎం కేసీఆర్‌ (CM KCR)కు కొత్త కాదు. భారాసకు దైవశక్తి అవసరం కాబట్టే యాగాలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో మా పార్టీలోకి చాలా రాష్ట్రాల నుంచి చేరికలు ఉంటాయి. జాతీయ స్థాయిలో భాజపాకు భారాస ప్రత్యామ్నాయం కాబోతోంది. భాజపా వ్యతిరేక కూటములను ఏకం చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులను బట్టి వ్యూహాలను ఖరారు చేస్తాం. 

అర్వింద్‌ ఎక్కడ పోటీ చేసినా వెళ్లి ఓడిస్తా..

భాజపా రణనీతిలో దర్యాప్తు సంస్థలు భాగమని ప్రజలకు తెలుసు. ఆ విషయంలో భయపడేది లేదు. భారత్‌ జాగృతి ద్వారా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతాం. రాష్ట్రంలో తెలంగాణ జాగృతి యథావిధిగా కొనసాగుతుంది. ఏపీలో ఎన్నికలకు సమయం ఉన్నందున ఇంకా అక్కడ మా వ్యూహాలు ఆలోచించలేదు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా. భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind) ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వెళ్లి ప్రచారం చేసి ఆయన్ను ఓడిస్తా’’ అని కవిత వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు