Kamal Haasan: లోకనాయకుడి కొత్త జట్టు..!

విశ్వ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌(ఎమ్‌ఎన్‌ఎమ్‌) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ తన కొత్త జట్టును ప్రకటించారు. పార్టీలో ఖాళీగా ఉన్న పలు కీలక పదవులను శనివారం భర్తీ చేశారు.

Published : 27 Jun 2021 01:13 IST

చెన్నై: విశ్వ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌(ఎమ్‌ఎన్‌ఎమ్‌) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ తన కొత్త జట్టును ప్రకటించారు. పార్టీలో ఖాళీగా ఉన్న పలు కీలక పదవులను శనివారం భర్తీ చేశారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కమల్‌ ఇకపై ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు. పార్టీ రాజకీయ సలహాదారులుగా.. సీనియర్‌ రాజకీయ నేత, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు సహాయకుడిగా వ్యవహరించిన పాల కరుపయ్య, పొన్రాజ్‌ వెళ్లైసామిలను నియమించారు. పార్టీ సంస్థాగత కార్యకలాపాల బాధ్యతలు నిర్వర్తించే ఉపాధ్యక్షుడిగా ఏజీ మౌర్య, పార్టీ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించే ఉపాధ్యక్షుడిగా తంగవేలు, కార్యదర్శులుగా సెంథిల్‌ ఆర్ముగమ్‌, శివ ఎలాంగో, శరత్‌బాబు, కేంద్ర కమిటీ సభ్యురాలిగా శ్రీప్రియ సేతుపతి, సంక్షేమ కార్యకలాపాల సమన్వయకర్తగా జీ నాగరాజన్‌లను కమల్‌ నియమించారు. భవిష్యత్తులో మరిన్ని నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. తాజాగా తాను నియమించిన నాయకులంతా ప్రజాసేవకు తమ జీవితాలను అంకితం చేసినవారేనని కమల్‌ తెలిపారు. వారికి పూర్తి సహకారం అందించాలని కార్యకర్తలకు సూచించారు.  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా దక్కించుకోలేక ఎమ్‌ఎన్‌ఎమ్ చతికిలబడ్డ సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన అనంతరం పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. కమల్‌హాసన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడు, పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన ఆర్‌ మహేంద్రన్‌.. పార్టీలో ప్రజాస్వామ్యం కరవైందంటూ ఎన్నికల అనంతరం బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐఏఎస్‌ అధికారి సంతోష్‌ బాబు సహా పలువురు సీనియర్‌ నేతలు సైతం పార్టీకి రాజీనామా చేశారు. దీంతో పార్టీలో కీలక పదవులు ఖాళీ అయిన నేపథ్యంలో వాటిని కమల్‌ తాజాగా భర్తీ చేశారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని