కమల్‌ హాసన్‌కు ఊరట 

ప్రముఖ సినీనటుడు, మక్కల్‌నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌కు ఊరట లభించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన పార్టీకి కేంద్ర ఎన్నికల ........

Published : 16 Jan 2021 00:26 IST

చెన్నై: ప్రముఖ సినీనటుడు, మక్కల్‌నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్‌కు ఊరట లభించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పార్టీకి టార్చ్‌లైట్‌ గుర్తునే కేటాయించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌ పార్టీ ఈ గుర్తుపైనే పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఎన్నికల సంఘం ‘టార్చ్‌లైట్‌’ను తమిళనాడులోని ఎంజీఆర్‌ మక్కల్‌ కచ్చి అనే రాజకీయ సంస్థతో పాటు పుదుచ్చేరిలోని ఎంఎన్‌ఎంకు కూడా కేటాయించింది. దీంతో కమల్‌హాసన్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. టార్చ్‌లైట్‌ గుర్తును తమకే కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఎంజీఆర్‌ మక్కల్‌ కచ్చి వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ఎంజీఆర్‌’ విశ్వనాథన్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తూ.. ఎంజీఆర్‌ విగ్రహం, ఆయనతో దగ్గరి సంబంధం ఉండేలా మరేదైనా గుర్తును తమకు కేటాయించాలని కోరారు.

వెలుగును విస్తరిద్దాం

ఎన్నికల్లో పోటీచేసేందుకు తమ పార్టీకే టార్చ్‌లైట్‌ గుర్తు దక్కడంపై కమల్‌హాసన్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. అణగారిన వర్గాల జీవన ప్రమాణాల మెరుగు కోసం పోరాటం చేసిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ పుట్టిన రోజు నాడు తమకు ఈ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి, ఇందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వెలుగును విస్తరిద్దాం అని పేర్కొన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్‌ మహేంద్రన్‌, ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఏఎస్‌ అధికారి సంతోష్‌బాబు సమక్షంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదీ చదవండి..

చరిత్ర సృష్టించిన నయా యార్కర్‌ కింగ్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని