Kangana Ranaut: కంగన చేరితే స్వాగతిస్తాం.. కానీ..!

కంగన రనౌత్‌ భాజపాలో చేరితే స్వాగతిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated : 30 Oct 2022 13:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘అవకాశం వస్తే ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నాను’ అంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘మోదీ పాలన పట్ల ప్రభావితమై చాలా మంది పార్టీలోకి వస్తున్నారు. వారిలో కంగన కూడా ఉంటే స్వాగతం. ఇక ఎన్నికల పోటీ విషయానికి వస్తే మాత్రం పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి అభిప్రాయల సేకరణ ఉంటుంది. ఆ తర్వాత పేరు ఎలక్షన్‌ కమిటీ, పార్లమెంటరీ బోర్డుకు వెళుతుంది. పనిచేసే వారందరికీ పార్టీలో స్థానం ఉంటుంది. కానీ, వారు ఏ బాధ్యతల్లో పనిచేయాలనే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుంది. షరతులపై ఎవరినీ పార్టీలో చేర్చుకోం. బేషరతుగా పార్టీలో చేరాలి’’ అని అన్నారు. 

రాజకీయ ప్రవేశంపై ఇటీవల కంగన హింట్ ఇచ్చారు. ‘నా సొంత రాష్ట్ర ప్రజల(హిమాచల్ ప్రదేశ్‌)కు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తాను. నరేంద్రమోదీ ప్రధాని మంత్రి అయిన తర్వాత భారత్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నేను కాంగ్రెస్ విధానాలను అనుసరించే కుటుంబం నుంచి వచ్చాను. మోదీ పనితీరుతో ఇప్పుడు మా కుటుంబం భాజపా పక్షాన నిలిచింది. నేను సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలని హిమాచల్‌ప్రదేశ్‌.. మరీ ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు, భాజపా కోరుకుంటే.. మండీ ప్రాంతం నుంచి పోటీ చేయడానికి సిద్ధమే’ అని వ్యాఖ్యానించారు. దీంతో కంగన రాజకీయరంగ ప్రవేశంపై ప్రచారం జోరందుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని