Published : 29 Sep 2021 23:50 IST

Kapil Sibal: ‘మాది జి-23.. జీ హుజూర్‌-23 బృందం కాదు..’

కాంగ్రెస్‌కు అధ్యక్షులు లేరు.. నిర్ణయాలు ఎవరివో తెలియదు 

పంజాబ్‌ పరిణామాలపై కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యలు

దిల్లీ: ఓ వైపు వరుసగా పార్టీని వీడుతున్న సీనియర్‌ నేతలు.. మరోవైపు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వరుస సంక్షోభాలతో కాంగ్రెస్‌ పార్టీ సతమతమవుతోంది. అయితే దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్‌ అధిష్ఠానం వైఖరే అని ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ అన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడు లేకుండానే కొనసాగుతోందని, ఇక పార్టీలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో కూడా తెలియట్లేదని విమర్శించారు. 

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్ సిద్ధూ అనూహ్య రాజీనామాతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మరింత సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై నేడు కపిల్‌ సిబల్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత మార్పులు తీసుకురావాలని, ఎన్నికలు చేపట్టాలని గతేడాది ఆగస్టులో నాతో సహా 23 మంది నేతలు అధిష్ఠానానికి లేఖ రాశాం. వారందరి తరఫున నేను మాట్లాడుతున్నా. ప్రస్తుతం మా పార్టీలో అధ్యక్షుడే లేరు. అందువల్ల ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో మాకు తెలియట్లేదు. గత కొంతకాలంగా మా పార్టీ నుంచి చాలా మంది వెళ్లిపోతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కాంగ్రెస్‌ అధినాయకత్వంతో అత్యంత దగ్గరి సంబంధాలున్నవారే పార్టీని వీడుతున్నారు. అధిష్ఠానంతో అంత సంబంధాలు లేవని భావిస్తున్నవారే ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. అయితే వారంతా ఎందుకు వెళ్లిపోతున్నారు? ఒకవేళ లోపం మన దగ్గరే ఉందా? అనే విషయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇందుకోసం తక్షణమే సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలి’’ అని సిబల్‌ అన్నారు. 

‘‘కాంగ్రెస్‌ ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటున్న పంజాబ్‌ ఓ సరిహద్దు రాష్ట్రం. తాజా పరిణామాలు ఐఎస్‌ఐ, పాకిస్థాన్‌కు అనుకూలంగా మారే అవకాశముంది. పంజాబ్‌లో అతివాదం పెరిగిన చరిత్ర మనకు తెలుసు. అవన్నీ దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ ఐకమత్యంగా ఉండాలి. పార్టీని వీడిన వారంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలి. ఈ గణతంత్ర దేశాన్ని కాపాడేది కాంగ్రెస్‌ ఒక్కటే’’ అని కపిల్‌ సిబల్‌ చెప్పుకొచ్చారు. 

దురదృష్టవశాత్తూ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండకూడదో అలాంటి స్థితిలోనే ఉందని సిబల్‌ విచారం వ్యక్తం చేశారు. తాము జి-23 నేతలమే కానీ, జీ హుజూర్‌ అనే నేతలం కాదని అన్నారు. అందుకే పార్టీలో ఎదురయ్యే సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అయితే తాము పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని