Karnataka: ఎన్నికల వేళ భాజపాకు షాక్‌.. కాంగ్రెస్‌లోకి త్వరలో కీలక నేత!

భాజపా (BJP) నేత బాబురావ్‌ చించన్‌సుర్‌ (Baburao Chinchansur) త్వరలో కాంగ్రెస్‌ (Congress)లో చేరనున్నారు. 2018లో కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి చేరిన ఆయన తిరిగి అదే గూటికి చేరనుండడం గమనార్హం.

Published : 21 Mar 2023 21:56 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భాజపా (BJP) నేత బాబురావ్‌ చించన్‌సుర్‌ (Baburao Chinchansur) త్వరలో కాంగ్రెస్‌ (Congress)లో చేరనున్నారు. శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. త్వరలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. 2018లో కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి చేరిన ఆయన తిరిగి సొంత గూటికి చేరనుండటం గమనార్హం.

కలబురిగి జిల్లా గుర్మిత్కాల్‌ నియోజకవర్గం నుంచి 2008 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన చించన్‌సుర్‌.. సిద్ధరామయ్య సారథ్యంలోని గత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత భాజపాలోకి వెళ్లారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ఏఐసీసీఐ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటమిలో ఈయన కీలక భూమిక పోషించారు. గుల్బర్గా స్థానానికి జరిగిన ఎన్నికలో భాజపా అభ్యర్థి ఉమేశ్‌ జాదవ్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు.

కర్ణాటకలోని కల్యాణ్‌ ప్రాంతంలోని కోలి-కబ్బలిగ సామాజిక వర్గానికి చెందిన ఈయన.. ఎన్నికల వేళ పార్టీ మారనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై బసవరాజ్‌ బొమ్మై స్పందిస్తూ... ఏ పార్టీ నుంచి వచ్చారో ఆ పార్టీకి తిరిగి వెళ్లిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని