CM Bommai: డీకేఎస్‌ మా MLAలకు ఫోన్లు చేసి ఆఫర్లు ఇస్తున్నారు.. సీఎం బొమ్మై

కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఆఫర్లు ఇస్తున్నారని కర్ణాటక సీఎం, భాజపా నేత బసవరాజ్‌ బొమ్మై ఆరోపించారు.

Published : 28 Mar 2023 19:06 IST

బాగల్‌కోట్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka assembly polls)సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Basavaraj bommai) కాంగ్రెస్‌(Congress) కర్ణాటక చీఫ్‌ డీకే శివకుమార్‌(DK shivakumar)పై తీవ్ర ఆరోపణలు చేశారు.  భాజపా ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోందని.. ఆ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించని స్థానాల్లో సీట్లు ఇస్తామంటూ ఆశచూపుతోందన్నారు. మంగళవారం బాగల్‌కోట్‌లో బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ గత రెండు మూడు రోజులుగా ఆ పార్టీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయని 100 నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారు. భాజపా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తే టిక్కెట్‌ఇస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు తీవ్ర నిరాశతో ఉన్నారు. వాళ్లకు సరైన అభ్యర్థులు కూడా లేరు. అందుకే ఆయన భాజపా నేతలకు ఫోన్లు చేస్తున్నారు. ఇదీ కాంగ్రెస్‌ పరిస్థితికి నిదర్శనం’’ అన్నారు. 

మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 234 స్థానాలకు గాను 124 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసి మార్చి 25న ప్రకటించింది. ఇంకా 100 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇంకోవైపు, ఏప్రిల్‌ తొలి వారంలో భాజపా తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో 150 సీట్లు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌, భాజపా నేతలు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని