
2023లో కర్ణాటకలోనూ అదే జరుగుతుంది!
మాజీ సీఎం కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
బెంగళూరు: ప్రజలు ప్రాంతీయ పార్టీల వైపే మొగ్గు చూపుతున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలను కర్ణాటక తిరస్కరిస్తుందని మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి వ్యాఖ్యానించారు. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లాగే కర్ణాటకలో కూడా 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రాంతీయ పార్టీనే ఎంచుకుంటారని అభిప్రాయపడ్డారు. హైకమాండ్‌లు దిల్లీలో కూర్చొని ఇక్కడ పాలించాలని ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు. శుక్రవారం ఆయన కర్ణాటక గవర్నర్ వాజుభాయి వాలా, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరికి లేఖలు రాశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు తదితర కీలకాంశాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని వారిని కోరారు. ఈ సందర్భంగా కుమారస్వామి విలేకర్లతో మాట్లాడారు.
‘‘దేశంలో ప్రజలు ప్రాంతీయ పార్టీల వైపే ఆకర్షితులవుతున్నారు. దక్షిణ భారతదేశంలో అయితే ఒక్క కర్ణాటక మినహా అన్ని రాష్ట్రాల్లోనూ భాజపా, కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక కూడా జాతీయ పార్టీలను తిరస్కరిస్తుంది. కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉంది. తమిళనాట డీఎంకే, ఏపీలో వైకాపా, తెలంగాణలో తెరాస అధికారంలో ఉన్నాయి. ప్రస్తుతం భాజపా పాలనలో ఉన్న కర్ణాటకలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్ ప్రధాన ప్రాంతీయ పార్టీ’’ అన్నారు.
‘‘భాజపా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోంది. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని డిమాండ్ చేస్తున్న కాషాయ పార్టీ.. ఇక్కడ మాత్రం కనీసం సమావేశాలను ఏర్పాటు చేయడం లేదు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. వైరస్‌ను కట్టడి చేయడంలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు మూడు రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, అన్ని అంశాలపైనా చర్చించాలి. వెంటనే సమావేశాలు ఏర్పాటు చేయకపోతే ఆందోళన చేస్తాం’’ అని కుమారస్వామి హెచ్చరించారు.
ఇవీ చదవండి
Advertisement