Karnataka: కాకరేపిన ఖాకీల కాషాయం దుస్తులు!

దసరా పండగ పురస్కరించుకొని కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న కాపు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులంతా కాషాయం చొక్కాలు, తెలుపు పంచెతో సంప్రదాయంగా ముస్తాబై ఫొటోలు దిగారు. ప్రస్తుతం అవి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. పోలీసులు కాషాయం రంగు చొక్కాలు ధరించి

Published : 19 Oct 2021 01:56 IST

బెంగళూరు: దసరా పండగ పురస్కరించుకొని కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న కాపు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులంతా కాషాయం చొక్కాలు, తెలుపు పంచెతో సంప్రదాయంగా ముస్తాబై ఫొటోలు దిగారు. ప్రస్తుతం అవి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసులు కాషాయం రంగు చొక్కాలు ధరించి సంబరాలు చేసుకోవడాన్ని తప్పుపడుతూ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ప్రశ్నించారు. ‘‘పోలీసుల యూనిఫాం ఒక్కటే ఎందుకు మార్చారు? వారికి త్రిశూలం కూడా ఇచ్చి హింసకు పాల్పడమని చెప్పకపోయారు? ఒకవైపు పోలీసులే సామాన్య ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే నేరుగా పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి నిందితుల్ని విడిపించుకొని వెళ్లాడు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలున్నాయా? మీకు పాలన చేతకకపోతే రాజీనామా చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. పోలీస్‌ వ్యవస్థను ఆర్‌ఎస్‌ఎస్‌లో విలీనం చేయాలని ప్రయత్నిస్తున్నారా అంటూ సీఎం బసవరాజ్‌ బొమ్మైను ప్రశ్నించారు. 

సిద్ధరామయ్య ట్వీట్లపై సీఎం బొమ్మై ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ అనేది జాతినిర్మాణం కోసం పాటుపడుతున్న అతిపెద్ద సంస్థ. ప్రతి పౌరుడిని సమానంగా చూస్తుంది. మీలా (కాంగ్రెస్‌ను ఉద్దేశించి) ఓటు బ్యాంక్‌ లెక్కలు కట్టదు. మా ప్రభుత్వం, మా పార్టీ రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తోంది. మీలా అదనపు రాజ్యాంగ వ్యవస్థ నేషనల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ (ఎన్‌ఏసీ)ను ఏర్పాటు చేయలేదు’’ అని సీఎం అన్నారు. ఉడిపి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే రఘుపతి భట్‌ కూడా సిద్ధరామయ్యపై మండిపడ్డారు. ‘‘కాషాయాన్ని చూస్తే అంత భయమెందుకు? కాషాయం అంటే త్యాగానికి ప్రతీక. ప్రాచీన కాలం నుంచి కాషాయాన్ని భక్తితో చూస్తున్నాం. పోలీసులు కాషాయం రంగు దుస్తుల్ని వేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న సిద్ధరామయ్యకు.. తాను టిప్పు సుల్తాన్‌ టోపీ ధరించి ఖడ్గాన్ని చేతపట్టినప్పుడు ఐక్యత గుర్తురాలేదా? పోలీసులు కాషాయం ధరిస్తే అందులో ఇబ్బందేముంది?’’అని ప్రశ్నించారు. పోలీసుల తీరు.. నేతల వ్యాఖ్యలతో ఈ వ్యవహారం కర్ణాటకలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని