Karnataka Results: శెట్టర్‌కు కలిసి రాని హస్తవాసి.. మంత్రులకూ షాక్!

Karnataka results: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో పలువురు మంత్రులకు షాక్‌ తగిలింది. అలాగే భాజపా నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన శెట్టర్‌కూ ఓటమి తప్పలేదు.

Updated : 13 May 2023 20:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలో చాలా ఏళ్ల తర్వాత ఓటర్లు (Karnataka Results) స్పష్టమైన తీర్పు ఇచ్చారు. గడిచిన 25 ఏళ్లలో రెండు సార్లు మినహా ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఇవ్వని కన్నడిగులు.. ఈ సారి హస్తం పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. భాజపా ప్రభుత్వంపై (BJP) తమ వ్యతిరేకతను చాటుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ దూకుడుతో భాజపా ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారూ ఓటమి పాలయ్యారు. భాజపా టికెట్‌ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీశ్‌ శెట్టార్‌ సైతం ఓటమి పాలయ్యారు. ప్రముఖులు, మంత్రుల గెలుపోటములు ఇవీ..

టాప్‌ లీడర్ల గెలుపు

  • షిగ్గావ్‌ నుంచి పోటీ చేసిన భాజపా నేత, సీఎం బసవరాజ్‌ బొమ్మై వరుసగా నాలుగోసారీ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి యాసిర్‌ అహ్మద్‌ ఖాన్‌ పఠాన్‌పై 36వేల ఓట్లతో గెలుపొందారు.
  • వరుణ నుంచి పోటీ చేసి మాజీ సీఎం సిద్ధ రామయ్య భాజపా నేత సోమణ్ణపై విజయం సాధించారు.
  • కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కనకపురా నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. డీకేకు లక్షకు పైగా ఓట్లు (70శాతం) రాగా.. భాజపా, జేడీఎస్‌ అభ్యర్థులకు 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
  • జేడీఎస్‌ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కుమారస్వామి చెన్నపట్న నుంచి మరోసారి గెలుపొందారు. ఆయన సోదరుడు హెచ్‌డీ రేవణ్ణ సైతం విజయం సాధించారు.
  • వీరితో పాటు చిత్తాపూర్‌ నుంచి పోటీ చేసిన మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్‌ ఖర్గే గెలు పొందారు. ఎన్నికల ముందు కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ స్థాపించిన గాలి జనార్దన రెడ్డి గంగావతి స్థానం నుంచి విజయం సాధించారు.

వీరికి ఓటమి షాక్‌..

  • ఈ సారి ఎన్నికల్లో దేవేగౌడ కుటుంబానికి గట్టి షాక్‌ తగిలింది. దేవేగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు హీరో నిఖిల్ గౌడ రామ నగర స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్‌ హుస్సేన్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు.
  • కర్ణాటక మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌కు ఈ సారి ఎన్నికల్లో కలిసి రాలేదు. భాజపా సీటు నిరాకరించడంతో కాంగ్రెస్‌లో చేరిన ఆయన హుబ్బళ్లి-ధార్వాడ్‌- సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఇక్కడి భాజపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయనలానే పార్టీని వీడి అథని స్థానం నుంచి కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన లక్ష్మణ్‌ సావడి మాత్రం విజయం సాధించడం గమనర్హం.
  • బసవరాజ్‌ బొమ్మై సర్కారులో మంత్రులుగా చేసిన వారూ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వరుణతో పాటు చామరాజనగర స్థానం నుంచి సోమణ్ణ ఓటమి చెందగా.. బళ్లారి నుంచి పోటీ చేసిన శ్రీరాములు, చిక్కబళ్లాపూర్‌ నుంచి పోటీ చేసిన కె. సుధాకర్‌, కృష్ణ రాజపేట నుంచి కేసీ నారాయణ గౌడ, నవల్‌ గుండ్‌ స్థానం నుంచి పోటీ చేసిన సీసీ పాటిల్‌, హిరికేరూర్‌ నుంచి పోటీ చేసిన బీసీ పాటిల్‌  ఓటమి చెందారు.
  • వీరితో పాటు భాజపా కీలక నేత, పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి చిక్‌ మంగళూరు నుంచి ఓటమి పాలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు