Kasu Mahesh Reddy: నాసిరకం మద్యం వల్లే ఓడిపోయాం

‘‘నాసిరకం మద్యం వల్లే మేం ఓడిపోయాం. అప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి చెప్పి చూశాం. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరాం.

Published : 24 Jun 2024 04:27 IST

సజ్జల, విజయసాయిరెడ్డిలకు చెప్పినా పట్టించుకోలేదు
చంద్రబాబును అవమానించామని.. వాళ్లు కసితో పనిచేశారు 
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి  

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: ‘‘నాసిరకం మద్యం వల్లే మేం ఓడిపోయాం. అప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి చెప్పి చూశాం. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరాం. కానీ చర్యలేవీ తీసుకోలేదు. చివరకు వైకాపా అధికారాన్ని కోల్పోయింది’’ అని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఒక వీడియో ద్వారా వైకాపా ఓటమికి కారణాలను వెల్లడించారు. ‘‘నాసిరకం మద్యం వల్ల మా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనేది వాస్తవం. ప్రజల్లో 25% రోజూ మద్యం తాగుతారు. వారంతా తెదేపా చేసిన నాసిరకం మద్యం అనే ప్రచారాన్ని నమ్మారు. అందుకే ఓడిపోయాం. ఇసుకపై ఆధారపడే కుటుంబాలు కూడా వైకాపాకు దూరమయ్యాయి. ఇసుక విధానం వల్ల ఎంతోమంది నష్టపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, కార్మిక కుటుంబాలు అన్నీ తెదేపా వైపు మళ్లాయి. చివరలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రచారం కూడా మాకు నష్టం చేసింది. తెదేపా అధినేత చంద్రబాబుకు వైకాపా చేసిన అవమానంతో మా పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. గతంలో తెదేపాలో ఉండి అనంతరం వైకాపాలోకి వచ్చిన కొంతమంది నేతలు చంద్రబాబును అనరాని మాటలు అని, అవహేళన చేశారు. చంద్రబాబును జైలులో పెట్టడం అవమానంగా భావించిన ఆ పార్టీ క్యాడర్‌ కసితో పనిచేసి తెదేపా గెలుపునకు కృషిచేసింది. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా ఎందుకు ఓడిపోయామని కార్యకర్తలు, నేతలు నన్ను అడుగుతున్నారు. వారందరికీ ఇలా వీడియో ద్వారా సమాధానం చెబుతున్నాను. సంక్షేమం బాగా చేసినా లోపాలున్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయలేకపోవడం వల్లే ఓడిపోయాం. చేసిన తప్పులను సమీక్షించుకుని, ప్రజలకు అండగా ఉంటూ.. మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని